ఆర్డినెన్స్‌కు… కొత్త కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్ నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారన్న విషయాన్నే ప్రభుత్వం హైకోర్టు ముందు ప్రధానంగా వాదించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అదే అంశాన్ని హైలెట్ చేస్తూ.. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. గవర్నర్ ఆమోదించిన తర్వాత దురుద్దేశాలు ఆపాదించడం సరి కాదని.. ప్రభుత్వం అందులో కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఎస్ఈసీగా రమేష్ కుమార్ తొలగింపుపై మొత్తం ఏడు పిటిషన్లు దాఖలు కాగా.. అన్నింటికీ.. ఒకే కౌంటర్ అఫిడవిట్‌ను ప్రభుత్వం దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేశామని… ఎస్ఈసీ పదవీ కాలాన్ని నిర్ణయించే అధికారం రాష్ట్ర గవర్నర్ కు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గవర్నర్ ఆమోదం తెలిపాకే ఆ ఆర్డినెన్స్ తెచ్చామని ప్రభుత్వం ఆఫిడవిట్ లో పేర్కొంది.
రాష్ట్ర గవర్నర్ ఆమోదించాక కూడా ఈ అంశంలో ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ పిటిషన్లు దాఖలు చేయటం సమంజసంకాదని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఎన్నికల కమిషనర్ సర్వీస్ రూల్స్ అన్నీ హైకోర్టు జడ్జి స్థాయిలో ఉండాలనే సవరణలతో కూడిన ఆర్డినెన్స్ ను రూపొందించామన్నారు. ఎన్.రమేష్ కుమార్ స్థానంలో మరో అధికారిని నియమించలేదని, ఎన్నికల కమిషన్ వ్యవస్థలోనే మార్పులు తెచ్చి రిటైర్డ్ న్యాయమూర్తికి అవకాశం కల్పించామని అఫిడవిట్ లో పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎస్ఈసీ సర్వీస్ రూల్స్ కు రక్షణ ఉందని.. పదవీకాలానికి లేదని ప్రభుత్వం అఫిడవిట్ లో వాదించింది. ఆర్టికల్ 243K ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవీకాలానికి సర్వీస్ రూల్స్ వేరుగా చూడాల్సిందేనని పేర్కొన్నారు.
ఎన్నికలు వాయిదా వేయడంపై ప్రభుత్వాన్ని సంప్రదించకపోవడం దగ్గర్నుంచి కేంద్రానికి లేఖ రాయడం వరకూ.. రమేష్ కుమార్ పక్షపాతంతో వ్యవహరించారని.. అఫిడవిట్లో చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. సీఎస్ నీలం సాహ్నీ తరపున ఈ అఫిడవిట్ ను పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ కౌంటర్ దాఖలు చేశారు. ఇలా చేయడానికి తనకు పర్మిషన్ ఉందని ద్వివేదీ పేర్కొన్నారు. మొత్తంగా.. గవర్నర్ సెంట్రిక్ గా.. అఫిడవిట్ ను ప్రభుత్వం సిద్దం చేసింది. సోమవారం ఈ పిటిషన్లు, ప్రభుత్వ కౌంటర్ పై విచారణ జరగనుంది.