ఆగస్టు పదిహేనో తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తామన్న ఏపీ సర్కార్ మళ్లీ వాయిదా బాట పట్టింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ… మరోసారి ముహుర్తం మార్చింది. ఈ సారి గాంధీ జయంతికి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెబుతున్నారు. ఇప్పటికి ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా పడటం నాలుగో సారి. మొదటి సారి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 14వ తేది సంక్రాంతి పండుగను ముహూర్తంగా నిర్ణయించారు. ఆ తరువాత మార్చిలో ఉగాదికి మార్చారు. ఆ తర్వాత అంబేద్కర్ జయంతికి మార్చారు. మళ్లీ ఆగస్టు 15న అన్నారు. ఇప్పుడు అక్టోబర్ 2వ తేదిన గాంధీ జయంతికి ఫిక్స్ చేశారు.
ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో న్యాయపరమైన చిక్కలు అనేకం ఉన్నాయి. సాధారణంగా ప్రభుత్వం ఎవరికైనా డికేటి పట్టాలు, బీఫాం రూపంలోనే స్థలాలిస్తారు. అంటే… అనుభవించాడనికే కానీ అమ్ముకునే అవకాశం లేదు. అమ్ముకునే అవకాశం ఇవ్వడం చట్ట విరుద్ధం కూడా. అయితే ఈ చట్టాలను పట్టించుకోకుండా జగన్ సర్కార్.. తాము ఇచ్చే స్థలాలను అమ్మేసుకోవచ్చని చెబుతున్నారు. హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టి వేసింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ వాయిదా పడుతూ వస్తోంది.
ప్రభుత్వానికి చట్ట నిబంధనలపై స్పష్టమైన అవగాహన ఉన్నా.. న్యాయపరమైన చిక్కులు వస్తాయని తెలిసినా.. ముహుర్తాలు ఖరారు చేసి.. పంపిణీ చేయలేక చేతులెత్తేస్తోంది. సుప్రీంకోర్టులో అయినా.. ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం లేదని.. డీకేటీ పట్టాల రూపంలోనే ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా మొండి పట్టుదలతో ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారంటున్నారు. దీని వెనుక కావాలనే… ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యం చేయాలనే ఆలోచన ఉందనే అభిప్రాయం రాజకీయవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.