రుషికొండను ఎలాగైనా మాయం చేయాలని కంకణం కట్టుకున్నారేమో కానీ.. తవ్వకాలపై ఎన్జీటీ ఇచ్చిన స్టే పై ఏపీ సర్కార్ నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లింది. పర్యావరణ అనుమతులన్నీ పొందిన తర్వాతే.. రుషికొండ తవ్వకాలను చేపట్టినట్లు ఏపీ సర్కార్ పేర్కొంది. పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా.. తవ్వకాలు, నిర్మాణాలు చేపడతామని పిటిషన్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. అయితే అసలు ఫిర్యాదే.. పర్యావరణ అనుమతులు తీసుకుని అంతకు మించి ఎక్కువగా తవ్వేస్తున్నారనేది. అందుకే.. ఎంత వరకూ పర్మిషన్ తీసుకున్నారు.. ఎంత వరకూ తవ్వారు లాంటి అంశాలను అధ్యయనం చేయడానికి ఎన్జీటీ కమిటీని నియమించింది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
తదుపరి ఉత్తర్వుల వరకు ఎలాంటి తవ్వకాలూ జరపరాదని ఎన్జీటీ ఆదేశించింది. కమిటీ విచారణ చేసి నివేదిక ఇస్తే… అనుమతులను ఉల్లంఘించారో లేదో స్పష్టమవుతుంది. అసలు కమిటీ విచారణ జరపకుండానే తాము అనుమతులు తీసుకున్నామంటూ వితండ వాదన చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం న్యాయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. సుప్రీంకోర్టు ఇలాంటి విషయాల్లో ఎన్జీటీలోనే తేల్చుకోవాలని అంతిమ నిర్ణయం తర్వాత తమ వద్దకు రావాలని చెబుతూ ఉంటుంది. పలు మార్లు ఇతర అంశాల్లో ఇదే జరిగింది.
ఇవన్నీ ఏపీ ప్రభుత్వ లాయర్లకు తెలియనిదేం కాదు. అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్న కారణం చూపి.. తవ్వకాలు కొనసాగించేందుకే ఇలా చేశారన్న అనుమానాలు కొంత మందిలో వ్యక్తమవుతున్నాయి. రుషికొండను ఇప్పటికే చుట్టూ తవ్వేశారు. ఇంకా తవ్వుతున్నారు. మొత్తం తవ్వాలనుకుంటున్నారోలేదో.. కానీ ఇప్పటికే పూర్తి స్థాయిలో సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.