ఆంధ్రప్రదేశ్లో మైహోం గ్రూపునకు చెందిన కంపెనీలకు ఇచ్చిన లైమ్ స్టోన్ లీజులను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే రామేశ్వరరావు, ఆయన కుమారుడు హుటాహుటిన వచ్చి సచివాలయంలో చంద్రబాబును కలిసినట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు వైపు నుంచి ఇంకా ఎటువంటి భరోసా రాలేదని తెలుస్తోంది.
మైహోమ్ గ్రూపు రామేశ్వరరావు,ఆయన కుమారుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీవీ9ను వైసీపీకి అప్పగించేసి ఏపీలో చాలా ఘనులు లీజుకు పొందారు. అనంతపురంతో పాటు పలు చోట్ల లైమ్ స్టోన్ లీజులు యాభై ఏళ్ల వరకూ పొందారు. ఇంకా బయటకు రాని అనేక ప్రయోజనాలు పొందినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంగా చంద్రబాబు,ఆయన కుమారుడిపై ఎంత వ్యక్తిత్వ హననం చేయాలో అంతా చేశారు. తెలుగుదేశం పార్టీపై ఎంతటి దుష్ప్రచారం చేయాలో ఆంతా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారే సరికి అక్రమంగా కేటాయించిన లీజుల విషయం వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
అప్పటికీ చంద్రబాబు, టీడీపీ పాలసీ ఒకటే. నీకు జగన్ రెడ్డి నచ్చితే ఎంతయినా పొగుడుకో .. నెత్తిమీద పెట్టుకో. మా మీద తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని ఎన్నో సార్లు బహిరంగంగానే హెచ్చరించారు. కానీ ఎప్పుడూ వాళ్లు తగ్గిన పాపాన పోలేదు. అత్యంత ఘోరంగా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కోనలు వండివార్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే నొప్పి తగిలిందేమో కానీ.. నేరుగా వచ్చి చంద్రబాబుతో రాజీకి వచ్చేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. అయితే యువనాయకత్వం మాత్రం ఇక ఎంత మాత్రం ఇలాంటి విషయాల్లో రాజీ పడేది లేదని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
గత ప్రభుత్వం అయితే ఇలాంటి లీజులపై దాడులు చేయించి.. లేనిపోయి లెక్కలు వేయించి వందల కోట్లు జరిమానా విధించేది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం అలాంటి వాటి జోలికి వెళ్లకుండా సింపుల్ గా లీజులు రద్దు చేస్తోందని అంటున్నారు.