ప్రభుత్వం ఈ నెలలో కొన్ని కార్పొరేషన్ల పేరుతో రెండు విడతలుగా 4300 కోట్ల వరకూ అప్పు తెచ్చింది. ఏరో కార్పొరేషన్ పేరుతో ఒక సారి… మారిటైం కార్పొరేషన్ పేరుతో మరోసారి రుణాలు తెచ్చింది. ఏరో కార్పొరేషన్‌కు ఏం తాకట్టు పెట్టారో స్పష్టత లేదు..కానీ మారిటైం కర్పొరేషన్ మాత్రం తాకట్టు పెట్టేసింది. కాకినాడ పోర్టుకు చెందిన నిషేధిత భూముల్ని రాత్రికి రాత్రి ఆ జాబితా నుంచి తొలగించేసి.. మొత్తం తాకట్టు పెట్టేసింది. 350 ఎకరాల వరకూ ఇలా తాకట్టు పెట్టినట్లుగా చెబుతున్నారు. దీని ద్వారా వచ్చిన సొమ్ముతో.. ఆర్బీఐకి ఓవర్ డ్రాఫ్ట్ కట్టడం లాంటి అప్పులు చెల్లించారు. మారిటైం బోర్డు తీసుకునే అప్పులు పోర్టుల అభివృద్ధికే వెచ్చించాలి. కానీ జరిగేది వేరు. కేంద్రం పట్టించుకోవాలి. అలా పట్టించుకునే పరిస్థితి లేదు.
ఇలా ఇష్టారీతిన బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పులు తెస్తున్నారు. దీనికి ఆస్తులను తాకట్టు పెడుతున్నారు. విశాఖలో కలెక్టరేట్లు సహా మొత్తం తాకట్టు పెట్టేశారు.ఇప్పుడు కాకినాడ వంతు. ముందు ముందు ఇతర ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెడతారు. అసలు చాలా వరకూ ఏపీ తాకట్టులోకి పోయి ఉంటుందని..కానీ బయటకు రావడం లేదన్న అనుమానాలు ఇప్పటికే ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం మొత్తం రహస్యంగా ఉంచుతోంది. వైట్ పేపర్ ప్రకటించడం ద్వారా కూడా ఈ వివరాలు వెలుగులోకి వచ్చే చాన్స్ లేదు. ప్రభుత్వం మారితేనే అసలు విషయాలు తెలుస్తాయి.
ఎన్ని అప్పులు చేసినా అవసరాలు తీరడం లేదు. తాకట్టు పెట్టడానికి ఆస్తులూ తరిగిపోతున్నాయి. ఇక ప్రభుత్వం ఏం చేస్తుందన్న దానిపై అనేక రకాల సెటైర్లు వినిపిస్తున్నాయి. ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వం తాకట్టు పెట్టుకునేలా వేసులుబాటు తెచ్చుకునేలా చట్టం చేసి.. ఇక మొత్తం సిటీల్ని తాకట్టు పెట్టేస్తుందన్న వాదన వినిపిస్తోంది. అయితే బ్యాంకులు ఎందుకు ఇలా అప్పులు ఇస్తున్నాయన్నది మాత్రం సస్పెన్స్‌గానే మారింది. కమిషన్ల కోసం బ్యాంకు ఉన్నతాధికారులు ఇలా చేస్తున్నారన్న వాదన ఉంది. కారణం ఏదైనా.. పాపం ఏపీ అనుకోక… తప్ప ఏం చేయలేని పరిస్థితి..!