ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా సమ్మెల్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తోంది. మొన్నటికి మొన్న వైద్య, ఆరోగ్య రంగంలో సమ్మెలను నిషేధిస్తూ ఎస్మా చట్టం ప్రయోగించింది. ఇప్పుడు.. విద్యుత్ సంస్థలపై అలాంటి నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆరు నెలల కాలంలో ఉద్యోగులు ఎలాంటి కారణంతోనూ సమ్మెలకు వెళ్లకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఇప్పుడు.. అత్యవసర సర్వీసు ఉద్యోగులంతా.. రేయింబవళ్లు పని చేస్తున్నారు. వాళ్లకు అసలు సమ్మె చేయాలనే ఆలోచన వచ్చే పరిస్థితి కూడా లేదు. అయినప్పటికీ .. ప్రభుత్వం సమ్మెలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఏపీ సర్కార్ ఇలా అత్యుత్సాహానికి ఎందుకు పోతోందన్న విషయం మాత్రం చాలా మందికి అర్థం కావడం లేదు.
వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది.. తమకు పీపీఈలు ఇవ్వడం లేదన్న అసంతృప్తిలో మొదట ఉన్నారు. ఓ డాక్టర్ ను సస్పెండ్ చేయడం.. వంటివి కూడా చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో .. దృష్టి మరల్చడం మంచిది కాదన్న ఉద్దేశంతో సేవలు కొనసాగిస్తున్నారు. విద్యాత్ సిబ్బంది కూడా అంతే. ప్రస్తుత లాక్ డౌన్ పిరియడ్‌లో.. డిమాండ్ , సరఫరాల మధ్య తేడా ఎగుడు, దిగుళ్లుగా ఉంటోంది. ఇలాంటి సమయంలో గ్రిడ్ ను కాపాడుకోవడం పెను సవాల్‌గా మారింది. అయినప్పటికీ.. రేయింబవళ్లు కష్టపడుతున్నారు. అయినా.. వీరు కూడా సమ్మె చేస్తారన్న అనుమానం.. ఏపీ ప్రభుత్వానికి ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదని ఉద్యోగవర్గాలు అంటున్నాయి.
సాధారణంగా.. ఫలానా డిమాండ్ల కోసం.. సమ్మెకు వెళ్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించిన తర్వాత.. చర్చలు సహా అన్ని ఆప్షన్స్ పూర్తయిన తర్వాత.. ప్రభుత్వం సమ్మెలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అయితే.. ఇప్పుడు ఎలాంటి పరిణామాలు లేకపోయినా ఎందుకు ఏపీ ప్రభుత్వం కంగారు పడుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. బహుశా.. వచ్చే నెల జీతాలు ఇవ్వడం కష్టం కావొచ్చన్న ఉద్దేశంతో.. మళ్లీ సగం జీతాలు లేదా.. అసలు జీతాలు ఇవ్వకపోవడం వంటి చర్యలేమైనా తీసుకోవాల్సి వస్తే ఉద్యోగులు సమ్మె చేస్తారని.. ప్రభుత్వం ఆందోళన చెందుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.