కరోనా కారణంగా విద్యా సంవత్సరం పరీక్షల ముందు గందరగోళంగా తయారైంది. ఏపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికల కోసం … ప్రకటించిన టెన్త్ షెడ్యూల్‌ను వాయిదా వేయడంతో… మొత్తానికే పరీక్షలు జరపలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించాలనే పట్టుదలకుపోయినా… కరోనా కేసులు ప్రమాదకరంగా విస్తరించడంతో చివరికి పరీక్షలను రద్దు చేసి..అందర్నీ పాస్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే.. ఇక్కడే అసలు మతలబు ఉంది. ప్రస్తుతం విద్యార్థులకు పాస్ అయినట్లుగా మాత్రమే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. అంటే… అందరూ ఒకటే కేటగిరి. ఏడాది అంతా కష్టపడిన వాళ్లకు అదే “పాస్”. గాల్లో దీపం చదువులు చదివిన వారికీ అదే “పాస్”. ఈ కారణంగా ఇప్పటికీ ఆ సర్టిఫికెట్ బాగానే ఉంటుంది కానీ.. భవిష్యత్‌లో మాత్రం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాలన్న ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది.
తెలంగాణతోపాటు చాలా రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మంచి కసరత్తు చేశాయి. విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూశాయి. టెన్త్ విద్యార్థుల మధ్యంతర పరీక్షలు.. ప్రీ ఫైనల్ పరీక్షలు వంటి వాటిల్లో సాధించిన మార్కుల ఆధారంగా వారకి గ్రేడింగ్ ఇచ్చారు. కష్టపడిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూసుకున్నారు. కానీ ఏపీలో మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయలేదు. హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ పరీక్షల ఆధారగా గ్రేడింగ్‌లు ఇవ్వాలన్న అభిప్రాయాలు … విజ్ఞప్తులు పెద్ద ఎత్తున వచ్చినా.. విద్యా శాఖ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో… ఉద్యోగాల కోసం.. కనీసం అరవై శాతం మార్కులు ఉన్న వారినే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రిఫర్ చేస్తున్నాయి. అసలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతనే ఏ గ్రేడ్‌ను పెడుతున్నాయి. తక్కువ మార్కులు వచ్చిన వారిని జస్ట్ పాస్ అయిన వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే ప్రస్తుతం.. టెన్త్ విద్యార్థులకు జారీ చేస్తున్న పాస్ సర్టిఫికెట్ల వల్ల.. భవిష్యత్‌లో ఆంధ్ర విద్యార్థులు… చాలా తీవ్రంగా నష్టపోతారని.. విద్యారంగ నిపుణులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉందంటున్నారు.
ఇక్కడ అసలు కొసమెరుపు ఉంది .. ఏపీ ఓపెన్ స్కూల్స్ విధానంలో నిర్వహించాల్సిన టెన్త్ పబ్లిక్ పరీక్షలను కూడా రద్దు చేశారు. అయితే.. వారికి మాత్రం పాస్ సర్టిఫికెట్లు కాకుండా.. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇస్తున్నారు. కొంత మందికి సాధారణంగా పాస్ సర్టిఫికెట్లు ఇచ్చేసి.. కొంత మందికే గ్రేడ్లు ఇవ్వడం ఏమిటన్న అసహనం విద్యార్థుల తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. ఓ పద్దతి.. ఆలోచన లేకపోవడంతోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయన్న చర్చ జరుగుతోంది.