ఎన్నికల ముందు వైసీపీ కార్యకర్తల్లా ఆడిన అధికారులపై కొత్త ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. వైసీపీ హాయంలో, ఎన్నికల సమయంలో అధికార పార్టీకి కొమ్ము కాసి, టీడీపీ-జనసేన నేతలపై ఉక్కుపాదం మోపిన అధికారులను తప్పిస్తోంది.
ఇప్పటికే సీఎంవోను కంట్రోల్ లోకి తీసుకున్న కాబోయే సీఎం చంద్రబాబు… సీఎస్ మార్చేస్తారని ముందే ఊహించిందే. సీఎస్ జవహర్ రెడ్డి అధికారికంగా సెలవుపై వెళ్లారు. జూన్ నెలాఖరున జవహర్ రెడ్డి రిటైర్ కాబోతున్నారు. దీంతో ఆయన రిటైర్మెంట్ వరకు సెలవులోనే ఉండనున్నారు. కొత్త ప్రభుత్వం వేటు వేస్తుందన్న ఉద్దేశంతోనే ఆయన సెలవుపై వెళ్లారు అనేది సచివాలయ వర్గాల మాట.
ఇక, కొత్త ప్రభుత్వం నుండి ఇప్పటికే వచ్చిన సమాచారం మేరకు సలహదారులను తప్పించబోతున్నారు. స్వతహాగా రాజీనామా చేస్తే ఓకే, లేదంటే వెంటనే తప్పించాలని ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.
సీఎస్ తో పాటు ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న రావత్ కూడా ఇప్పటికే సెలవుపై వెళ్లగా… సీఐడీ చీఫ్ సంజయ్ కూడా సెలవుపై వెళ్లేందుకు మొగ్గుచూపారు. కానీ, తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన సెలవులను రద్దు చేసుకున్నారు.
ఇక, బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉండగా ఎన్నికల ముందు ఈసీ నిబంధనలకు వ్యతిరేకంగా టీచర్ల బదిలీలు జరిగాయి. బొత్స ఒత్తిడితోనే జరిగాయన్న ఆరోపణలున్న నేపథ్యంలో టీచర్ల బదిలీలలను కొత్త ప్రభుత్వం హోల్డ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.