ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపై వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది కానీ… ప్రాక్టికల్‌గా చూస్తే మాత్రం ప్రతీ రోజూ వెనుకడుగులు వేస్తూనే ఉంది. ముందు బిల్లులు వెనక్కి తీసుకున్నారు. సీఆర్డీఏ రద్దును కూడా ఉపసంహరించుకుంటున్నారు. ఇప్పుడు అమరావతిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. సోమవారం అమరావతి లోని ఏపీ హైకోర్టులోని అదనపు భవన నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగింది. ఈ భవన నిర్మాణం కోసం ఏపీ సర్కార్ రూ. 30కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే ఈ శంకుస్థాపనకు అధికారులు మాత్రమే హాజరయ్యారు. రాజకీయ నేతలు ఎవరూ హాజరు కాలేదు.
రూ. 29 కోట్ల 40 లక్షల అంచనా వ్యంతో 14 కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు తదితరాల కోసం సుమారు 76,000 చదరపు అడుగుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. నిజానికి ఈ అదనపు భవన ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం … అమరావతి మాస్టర్ ప్లాన్‌లో జిల్లా కోర్టు కోసం ప్రతిపాదించారు. పూర్తి స్థాయి హైకోర్టు భవన నిర్మాణానికి గతంలో శంకుస్థాపన జరిగింది. అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణాలన్నింటినీ నిలిపివేసింది. హైకోర్టు భవనం కూడా పునాదుల స్థాయిలోనే ఆగిపోయింది. ఈ కారణంగా ప్రస్తుతం హైకోర్టు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగాలంటే మరో భవనం అవసరం అని ప్రతిపాదించారు.
కానీ ప్రభుత్వం చాలా కాలం ఆలస్యం చేసింది. మూడు రాజధానులు చేస్తున్నందున కర్నూలుకు హైకోర్టుకు తరలించాలని భావిస్తున్నందున అదనపు నిర్మాణం కోసం ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదు. చివరికి ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు. ఈ నిర్మాణం ప్రారంభంతో కర్నూలు న్యాయరాజధాని అన్న మరో ఆలోచన మరో అడుగు వెనక్కి పోయిటనట్లయిందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఏర్పడింది.