ముందూ వెనుకా చూసుకోకుండా…. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పై దూకుడుగా వెళ్లిన ఏపీ సర్కార్.. ఆ ప్రాజెక్ట్‌ను పూర్తిగా రిస్క్‌లో పడేసింది. టెండర్లు ఖరారు చేసి..మేఘా కన్సార్టియంకు పనులు అప్పగించేసిన తర్వాత ఇప్పుడు… ఆ ప్రాజెక్టును నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పర్యావరణ అనుమతులు కావాల్సిందేనని జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. పూర్తిస్థాయి డీపీఆర్ సమర్పించాల్సిందేనని స్పష్టం చేసి కేంద్ర జలశక్తి శాఖ మరో వంక ఆదేశాలిచ్చింది. దీంతో ఆ ప్రాజెక్టు ఇప్పుడల్లా పట్టాలెక్కడం సాధ్యం కాదని తేలిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు 800 అడుగులకు చేరగానే..రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోసి రాయలసీమకు నీరు అందిస్తామని జగన్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
ఈ ప్రాజెక్టుపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. తెలంగాణ సర్కార్ కేంద్రానికి ఫిర్యాదు చేయడమే కాకుండా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసింది. అపెక్స్ కౌన్సిల్ భేటీ కూడా నిర్వహించారు. ఈ భేటీలో కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సమర్పించాలని నిర్ణయించారు. అయితే రాయలసీమ ఎత్తిపోతల కొత్త ప్రాజెక్ట్ కాదని ఏపీ సర్కార్ వాదిస్తోంది. ఇప్పుడు.. కేంద్రం అది కొత్త ప్రాజెక్టేనని నిర్ధారించి… డీపీఆర్ సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ వేసిన పిటిషన్‌పై అఫిడవిట్ కూడా వేసింది.
డీపీఆర్ ను తయారు చేయడం, ఆ తర్వాత పర్యావరణ అనుమతులు తీసుకోవడం ఇప్పుడల్లా సాధ్యమయ్యే పని కాదు. ఏళ్ల తరబడి ఈ వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. దీంతో… గత ప్రభుత్వం గుట్టుగా నిర్మించేసిన పట్టిసీమ, ముచ్చుమర్రిలా … పూర్తి చేయాల్సిన సంగమేశ్వరం ప్రాజెక్ట్‌ను హంగామా చేసి రిస్క్‌లో పెట్టేసినట్లయింది ప్రభుత్వం. ఇప్పుడు రాయలసీమకు నీరు అందించే అవకాశం రిస్క్‌లో పడిపోయింది.