మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పీడ్ తగ్గించింది. ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని చాలా తక్కువగా మాట్లాడుతోంది. న్యాయపోరాటం అంశంలోనూ వెనుకడుగు వేస్తోంది. వాయిదాలు పడినా పర్వాలేదని అనుకుంటోంది. స్వయంగా బొత్స సత్యనారాయణ కూడా కోర్టు అనుమతితోనే తరలిస్తామని చెబుతున్నారు. ఆయనే నిన్నామొన్నటి వరకూ నేడో రేపో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే ప్రచారం చేశారు. భూములు, భవనాలు పరిశీలించారు. కానీ ఇప్పుడు కోర్టు అనుమతి అంటున్నారు. వాయిదా కోరినందుకు అమరావతి రైతుల్ని నిందిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వ్యూహాత్మకంగా వెనుకడుగు వేస్తుందని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది.
ఇటీవల ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధి పనులను కూడా ప్రారంభిస్తోంది. హైకోర్టు విస్తరణకు దాదాపుగా రూ. ముఫ్పై కోట్లను మంజూరు చేసింది. ఓ వైపు అనంతపురం – గుంటూరు రహదారికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. 418 కిలోమీటర్లు మేర రూ.9 వేల కోట్లు ఖర్చు చేసి రహదారిని నిర్ణయించనున్నారు. గత ప్రభుత్వంలో ఇది అమరావతిని కలిపేలా నిర్మించాలని నిర్ణయించారు. చాలా వరకు భూసేకరణ… వంటి పనులు జరిగాయి . కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనను పక్కన పెట్టేశారు. పనులు నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ రహదారిని నిర్మించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం పంపింది. మరికొన్ని అమరావతి నిర్మాణాలను కూడా ప్రారంభించాలని అనుకుంటున్నప్పటికీ బ్యాంకుల రుణాలు దొరక్కపోవడంతో ముందుకు సాగడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
శాసనసభలో అయినా… బయట ఎలాంటి అధికారిక ప్రసంగాల్లో అయినా మూడు రాజధానుల ప్రస్తావన తేవడాన్ని సహజలక్షణంగా పెట్టుకున్న ప్రభుత్వం ఇటీవలి కాలంలో కాస్త వెనుకడుగు వేసింది. ఆగస్టు పదిహేను వేడుకల్లో సీఎం జగన్ నోటివెంట మూడు రాజధానుల ప్రస్తావన రాలేదు. ఇటీవల దూకుడుగా నిర్ణయాలు కూడా లేవు. ఈ పరిణామాలతో మూడు రాజధానులపై జగన్మోహన్ రెడ్డి మెత్తబడ్డారన్న అభిప్రాయం ఆ పార్టీలోనూ వ్యక్తమవుతోంది.
అయితే వైసీపీ రాజకీయంపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఎన్నికల మూడ్ వచ్చేసిందని ఇప్పటికిప్పుడు రాజధానులపై రచ్చ కొనసాగితే అది వచ్చే ఎన్నికలకు భారీ ఎఫెక్ట్ అవుతుందని అందుకే వీలైనంత వరకూ స్మూత్‌గా పనులు చేసుకెళ్లడం మంచిదన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో యంత్రాంగాన్ని కదిలించాలంటే ఇప్పుడు చాలా ఖర్చులు అవుతాయి. పథకాలు, జీతాలు సకాలంలో చెల్లించడానికే తంటాలు పడే పరిస్థితి. ఇవన్నీ ఆలోచించుకునే ప్రభుత్వం కాస్త నెమ్మదించిందన్న అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.