ఏపీలో కొంతమంది ఉన్నతాధికారుల తీరు ఏమాత్రం మారడం లేదు. జగన్ రెడ్డి దృష్టిని ఆకర్షించేందుకు ఈసీ గైడ్ లైన్స్ ను సైతం లెక్క చేయడం లేదు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ అందుకు విరుద్దంగా ఆదేశాలు ఇస్తున్నారు. ఎన్నికల కోడ్ ప్రతిపక్ష నేతలకు మాత్రమే వర్తిస్తుంది తప్పితే మనకు కాదనేలా వ్యవహరిస్తున్నారు.
ఏపీలో భూముల సర్వే ఫేజ్ 2, ఫేజ్ 3 జరిగినా సంబంధిత ఎల్పీఎంలు , పాస్ పుస్తకాలను ఇప్పుడు ముద్రిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక సీఎం ఫోటోను , ప్రభుత్వ సంబంధిత ఫోటోలను ముద్రించకూడదు. కానీ , సర్వే అనంతరం రైతులకు ఇస్తున్న పత్రాలపై జగన్ , ఆయన తండ్రి వైఎస్సార్, ప్రభుత్వ పథకం నవరత్నాల ఫోటోను సైతం ముద్రిస్తున్నారు. జగన్ ఫోటోను ఒక్క చోట మాత్రమే కాదు, ప్రతి పేజీలో ముద్రించడం గమనార్హం. అన్ని డాక్యుమెంట్లపై జగన్ ఫోటోను పెట్టాల్సిందేనంటూ ఎన్నికల నిబంధనావళికి వ్యతిరేకంగా జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు ఉన్నతాధికారి. తన చెప్పినట్లు నడుచుకోవాలన్నారు. సదరు ఉన్నతాధికారి తీరుపై జాయింట్ కలెక్టర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో ఎన్నికల నిబంధనలపై ఈసీ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఏం చేయాలో, ఏం చేయకూడదో కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు పంపిన గైడ్ లైన్స్ ల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ అందుకు విరుద్దంగా కొంతమంది ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. జగన్ రెడ్డి మెప్పు కోసం చేయకూడని పనులు చేస్తూ.. తమ కింది స్థాయి అధికారులను సైతం బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.