ఎపి పునర్వ్యవస్ఘీకరణ చట్టం అమలులో కేంద్రం జోక్యానికి గడువు జూన్2తో ముగిసిపోతుంది గనక మరింత కాలం పొడగించాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోరనున్నట్టు ప్రకటన వెలువడింది. అలాగే రాష్ట్రానికి వచ్చిన వారికి స్తానికత కల్పించే విషయంలో ఇప్పటి వరకూ తగినంత స్పందన రాలేదు గనక మరో రెండేళ్లు పొడగించాలని కూడా కోరనున్నదట. వాస్తవం ఏమంటే రెండు రాష్ట్రాలతో సంబంధం లేని కేంద్ర నిర్ణయమే అయిన ప్రత్యేకహాదా విషయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూస్తే వారి ఆలోచన ఎలా వుందో తెలుస్తుంది. అయినా అప్రమత్తంగా వుండి సకాలంలో వెంటపడ్డంలో ఎపి చాలా నిర్లిప్తంగా వ్యవహరించింది. చెప్పాలంటే ఇప్పుడు కూడా ఎవరో కొందరు వెంటపడితే తప్ప విభజన సమస్యలపై గట్టిగా కేంద్రీకరించాలని ముఖ్యమంత్రికి లేదు. నాలుగైదు వేల కోట్లు మాత్రమే వచ్చే విభజన అంశాలపై పట్టుపడితే హైకోర్టు విభజన ముందుకు వస్తుందనీ, అప్పుడు తలుపులు మూసుకుపోతాయని ఆయన ఆలోచనగా వుందంటున్నారు. కేంద్రాన్ని గట్టిగా అడిగే పరిస్థితి లేదు గనక జూన్1న సుప్రీం కోర్టులో కేసు వేయాలని మాత్రం నిర్ణయం తీసుకున్నారట. దానిపై అత్యున్నత న్యాయస్తానం ఎలా స్పందిస్తుందో తెలియదు. మా ధర్మం మేము చేశామని చెప్పుకోవడానికి టిడిపికి అవకావం వుంటుంది.విశాఖ మహానాడులోనూ దీనిపై ఒక రాజకీయ తీర్మానం చేస్తారు. అంతే కథ సమాప్తి. ఇంతకూ బిజెపి అద్యక్షుడు అమిత్ షా తెలంగాణలో మూడు రోజులు వుంటే ఎపిలో ఒక రోజు అదీ బలవంతం మీద గడుపుతున్నారు. కేంద్రం రాజకీయ ప్రాధాన్యతలు ఎలా వున్నాయో దీన్నిబట్టి తెలియడం లేదూ? మూడేళ్లలో పరిష్కారం కాని అంశాలపై కేంద్రం జోక్యానికి ఇకముందు కూడా అవకాశం వుంటుందని ఎపి ప్రభుత్వం అంతర్గత అవగాహనగా వుంది.తెలంగాణకు సంబంధించినంతవరకూ అత్యధిక సంస్తలు ఆస్తులు హైదరాబాదు ఆ చుట్టుపక్కలే వున్నాయి గనక హడావుడి లేదు. అయితే ఇరు ప్రభుత్వాలు వాటిని నడిపించే పార్టీలు రాజకీయ ప్రచారానికి ఈ సమస్యలను వాడుకోవడం తథ్యంగా కనిపిస్తుంది. ఇక కేంద్రం వరకూ చూస్తే వారిలో వారు కీచులాడుతున్నారు గనక జాతీయ పార్టీ అయిన మేమే పరిష్కారం చేయగలమని చెప్పదల్చుకున్నారు. అది అమిత్ షా పర్యటనతోనే మొదలు కావచ్చు.