ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతున్న సమయంలో.. ఏపీ సర్కార్.. నిర్ణయాన్ని మార్చుకుంది. రంగులన్నింటినీ తొలగించాలని నిర్ణయించింది. ఒక్క తెలుగు రంగు మాత్రమే ఉండాలని.. తక్షణమే రంగులన్నింటినీ మార్చాలని సంబంధిత శాఖలను ఆదేశించింది. అయితే ఏపీ సర్కార్ ఇక్కడా ఓ ట్విస్ట్ ఇచ్చింది. అన్ని కార్యాలయాలకు రంగులు మార్చమని చెప్పింది.. అదే సమయంలో.. ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ఉండాల్సిందేనని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇది కూడా కోర్టు తీర్పునకు వక్రభాష్యం చెప్పుకోవడమేనని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు. గతంలో హైకోర్టులో వాదనలు జరిగిన సమయంలో… జగన్ బొమ్మ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది.
ప్రధానమంత్రి బొమ్మలు ఏ కార్యాలయంపైనైనా పెడుతున్నారా… ఇక్కడ ముఖ్యమంత్రి బొమ్ములు ఎందుకు పెడుతున్నారని.. ఓ సందర్భంలో ధర్మాసనం ప్రశ్నించింది. అయితే.. ప్రధానంగా రంగుల విషయంలో వాదోపవాదాలు జరగడంతో … బొమ్మల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఇప్పుడు రంగుల గురించి మాత్రమే కోర్టులు తీర్పులు చెప్పాయని… ముఖ్యమంత్రి బొమ్మ తీసేయమని చెప్పలేదని .. ఏపీ సర్కార్ తనకు తాను సమర్థించుకుంటూ కొత్త ఉత్తర్వలిచ్చినట్లుగా తెలుస్తోంది. ఇది కూడా వివాదాస్పదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
అన్ని కార్యాలయాలకు రంగులు వేయడానికి పధ్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. మరి తీయడానికి.. కొత్తగా తెలుపు రంగులేయడానికి కూడా..కనీసం వెయ్యి కోట్లు ఖర్చవుతుంది. ఆ సొమ్మంతా ఎవరు ఇస్తారు అనేదానికి ప్రభుత్వం సలహా ఇచ్చింది. పధ్నాలుగో ఆర్థిక సంఘం నుంచి మంజూరయిన నిధులు వాడుకోవాలని తేల్చేసింది. సహజంగా వాటిని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించాలి. కానీ అవి రంగుల పాలవుతున్నాయి.