అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూములను ఎలాగైనా ఇళ్ల స్థలాల కోసం పంచాల్సిందేనని ఏపీ సర్కార్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇలా కేటాయిస్తూ.. జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. అయినా.. వెనక్కి తగ్గకూడదన్న ఉద్దేశంతో మరో జీవో జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ.. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని.. గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ కొత్త జీవో జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను పాటించాలంటే అమరావతిలోని భూములను.. ఇతర ప్రాంతాల వారికి ఇవ్వకూడదు. కానీ ప్రభుత్వం వారికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలంటూ… జీవోలో చెప్పింది. అదెలా సాధ్యం అని చాలా మందికి డౌట్ వస్తుంది. అందుకే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని ప్రభుత్వం కలెక్టర్లకు చెబుతూ.. ఆదేశాలిచ్చింది. లబ్దిదారులకు ఇళ్ల స్థలాలిచ్చే ప్రక్రియ చేపట్టాలని అందులో సూచించింది.
సీఆర్డీఏ చట్టం ప్రకారం… కోర్ క్యాపిటల్ ఏరియా అయిన 29 గ్రామాల్లో ఐదు శాతం భూముల్ని భూములు లేని పేదల నివాస వసతి కోసం వినియోగించాలి. అంటే.. ఆ 29 గ్రామాల్లోని వారి కోసమే.. ఆ భూమి ఉపయోగించాలి. కానీ ప్రస్తుతం సర్కార్.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ఇతర ప్రాంతాలు వారికి అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించింది. ఇది చట్ట విరుద్ధం అని హైకోర్టు జీవోను సస్పెండ్ చేసింది. ఇప్పుడు అందరికీ ఇళ్లు కేటాయించాలంటే.. సీఆర్డీఏ చట్టంలోని “ఆ గ్రామాల్లో”ని వారికే ఇళ్లు కేటాయించాలనే నిబంధనను మార్చాల్సి ఉంది. అవసరం అయితే దాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎలా చూసినా ఇప్పుడు కలెక్టర్లు అమరావతి భూముల్లో ఇళ్ల స్థలాల ప్రక్రియ ప్రారంభించాలంటే.. కోర్టు ధిక్కారం అవుతుంది.
తాము సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయబోతున్నామని ఆ తీర్పు వచ్చే వరకూ వేచి చూసి.. అవి వచ్చాక తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. అంటే.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసి.. అది విచారణ జరిగి.. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాతనే.. కలెక్టర్లు పనులు చేయాల్సి ఉంటుంది. దాని కోసం.. ఆ తీర్పు వచ్చిన తర్వాత జీనో జారీ చేయవచ్చు కదా అనే సందేహం అధికారులకు ఉంది. ఏం జరిగిందినా అధికారులను ఇబ్బంది పెట్టేలా.. తాము సేఫ్ అయ్యాలా ఈ జీవో జారీ చేశారన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకే అసలు ఈ ఆదేశాల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో సీక్రెట్ ఏమిటన్నదానిపై ఆసక్తి ఏర్పడుతోంది.