ఏపీలో వాలంటీర్లకు పనేమీ చెప్పడం లేదు కానీ వారి జీతాలు మాత్రం ఠంచన్ గా ఇచ్చేస్తున్నారు. వచ్చే నెల కూడా అలా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజీనామా చేసిన వాళ్లు చేసి పోగా.. మిగిలిన వాళ్లకు దాదాపుగా యాభై కోట్ల వరకూ బిల్లు అవుతోంది. వాటిని ఇచ్చేస్తున్నారు. పేపర్ అలవెన్స్ మాత్రం ఆపేయాలని ఆదేశించారు.
వచ్చే నెల కూడా ఒకటో తేదీన సామాజిక పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. వాలంటీర్ల సేవలు వద్దని.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతోనే పూర్తి చేయాలని డిసైడయ్యారు. వాలంటీర్లు లేకపోయినా సేవలకు అంతరాయం కలగదని లబ్దిదారులకు నమ్మకం కలిగించడమే లక్ష్యంగా ప్రస్తుతానికిఈ పని చేస్తున్నారు. అయితే వాలంటీర్లను కొనసాగిస్తామని చెబుతున్నారు. జీతాలు కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే పనులేమీ చేయించుకోకుండానే వారికి జీతాలిస్తున్నారు.
వాలంటీర్లను ఏం చేయాలన్నదానిపై ఇప్పటికీ ప్రభుత్వానికి ఓ క్లూ లేకుండా పోయింది. దానిపై ఎలాంటి కసరత్తు జరుగుతుందో స్పష్టతలేదు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే ఆలోచన లేదని అసెంబ్లీలో కూడా చెప్పారు.కానీ వారిని భిన్నంగా ఉపయోగించుకోవాల్సి ఉంది. ఆ ప్రక్రియ ప్రారంభమయ్యే వరకూ వారికి పనులేమీ చెప్పకుండానే జీతాలివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.