ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టేది లేదని ఏపీ సర్కార్ భీష్మించుకుని కూర్చుంటోంది కానీ. . ఎందుకైనా మంచిదన్నట్లుగా ఏర్పాట్లు మాత్రం చేస్తోంది. రాజ్యాంగ సంస్థ నిర్ణయాన్ని ఎల్ల కాలమూ ధిక్కరించడం సాధ్యం కాదన్న ఉద్దేశమో.. ఎన్నికలు పెట్టేస్తే పోలా.. అన్న అభిప్రాయమో కానీ.. కొత్త బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదింపచేసుకోవాలని నిర్ణయించారు. ఈ బిల్లు ప్రకారం… పంచాయతీ ఎన్నికలు శరవేగంగా పూర్తి కానున్నాయి. రెండు అంటే రెండు వారాల్లో నామినేషన్ల నుంచి ఓట్ల లెక్కింపు వరకు పూర్తవుతాయి. పంచాయతీరాజ్ చట్టానికి ఇప్పటికే సవరణలు చేశారు. వాటిని అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకోవాల్సి ఉంది.
చివరి సారిగా 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికలను 21 రోజుల్లో పూర్తి చేశారు. అంటే మూడు వారాలు. ఈ సారి రెండు వారాలకు సమయం కేటాయించారు. 14 రోజులకు కుదిస్తూ 1994 పంచాయతీరాజ్ చట్టంలో చేసిన సవరణలపై ఆగస్టులో గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. గడువులోగా అసెంబ్లీలో బిల్లు పెట్టకపోవడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు బిల్లు పెట్టి ఆమోదించుకోవాలని నిర్ణయించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతామని చెబుతున్నారు. ఆయన ప్రభుత్వం సహకరించాల్సిందేనని లేఖలు రాస్తున్నారు. సహకరించకపోతే కోర్టు ధిక్కరణ అవుతుంది.
సుప్రీంకోర్టులో పోరాడినా ప్రయోజనం ఉంటుందో లేదో తెలియదు. అందుకే.. వీలైనంత కాలం సాగ దీసి.. చివరికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని అనుకుంటున్నారు. అక్కడ సానుకూల ఫలితం వస్తే.. నిమ్మగడ్డ పదవీ విరమణ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారు. లేకపోతే.. ఫిబ్రవరిలోనే.. నిర్వహించడానికి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తాజా పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.