ఖరీఫ్ పంటకాలం దగ్గరపడుతున్నది. ఒక వైపు రైతులకు బ్యాంకులు అప్పివ్వని పరిస్ధితి… మరోవైపు ఎక్కడ కాల్ మనీ కేసులు ఎక్కడ విరుచుకు పడతాయో అని వడ్డీ వ్యాపారులు భయపడే పరిస్ధితి…ఇదంతా చంద్రబాబు పుణ్యమే నని వ్యవసాయదారులు తిట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు తప్ప గ్రౌండ్ రియాలిటీస్ తెలిసిన తెలుగుదేశం నాయకులు రైతురుణమాఫీ గురించి ప్రస్తావించే సాహసం కూడా చేయడం లేదు.
రైతుల పంట రుణాలన్నీ మాఫీ చేస్తామన్నది టిడిపి ఎన్నికల వాగ్ధానం. టిడిపి అధికారంలోకి వస్తే తమ అప్పులు రద్దవుతాయన్న నమ్మకంతో రైతులు బ్యాంక్ బాకీలు కట్టలేదు. కట్టొద్దంటూ చంద్రబాబునాయుడే ప్రచారం చేశారు. కానీ, లోటు బడ్జెట్ కారణంగా మొత్తం మాఫీ చేయలేమన్న చంద్రబాబు ప్రభుత్వం కుటుంబానికి లక్షన్నర రూపాయల రుణం మాఫీ చేసేందుకు ఒప్పుకుంది. కోటయ్య కమిటీ నియామకం, విధివిధానాలు ఖరారు చేయడం ఈలోగా రైతుల మీద అపరాధ వడ్డీల భారం పెరిగింది.
లక్షన్నర రుణాన్ని 5 విడతలగా మాఫీ చేస్తామన్నారు. 50వేల రూపాయల రుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తామన్నారు. ఆచరణలో 10 నుంచి 20 వేల రూపాయల అప్పు మాత్రమే మాఫీ చేశారు. అది కూడా ఒక పద్ధతిగా లేదు. రుణమాఫీ జాబితాలో కొంతమంది అర్హుల పేర్లు గల్లంతయ్యాయి. ఆధార్, రేషన్ కార్డుల్లో పేర్లు తేడాలున్నాయంటూ మరికొందరి పేర్లు పోయాయి. 14 కాలాల ప్రొఫార్మాతో మరికొందరిని వడపోశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధనతో పాతికశాతం మందిని అనర్హులుగా మార్చేశారు.
వీటన్నిటి ఫలితంగా రైతులు నమ్మినట్టు అప్పు మాఫీ కాలేదు. అపరాధ వడ్డీ పెరిగింది. అప్పు తీర్చాలంటూ బ్యాంక్ లు ఒత్తిడి తెచ్చాయి. కొత్త అప్పులివ్వలేదు. దీంతో బంగారం తాకట్టు పెట్టి కొంతమంది అప్పు తీర్చారు. చివరకు గ్యాస్ సబ్సిడీ కింద వచ్చిన స్వల్ప మొత్తాన్ని కూడా బ్యాంక్ లు బకాయిల కింద జమ చేసుకున్నాయి.
ప్రభుత్వం స్రుష్టించిన గందరగోళం కారణంగా కొంతమంది రైతులకు డిఫాల్టర్ల బ్యాడ్ ఇమేజ్ వచ్చింది.
బ్యాంకుల రుణ ప్రణాళిక ప్రకారం గత సంవత్సరం వ్యవసాయ రుణాల కింద 56 వేల కోట్లు రూపాయలు ఇవ్వవలసి వుంది. కానీ, బ్యాంక్ లు వాస్తవంగా ఇచ్చింది 7 వేల కోట్ల రూపాయలు మాత్రమే. రుణమాఫీ సక్రమంగా అమలుకాకపోవడం వల్ల బ్యాంక్ ల్లో అప్పుపుట్టని పరిస్థితికి ఈ అంకెలకు మించిన సాక్ష్యం అవసరంలేదు.
మరో వైపు రుణమాఫీ వల్ల 24వేల కోట్ల రూపాయల భారం పడ్డట్టు ప్రభుత్వం చెబుతోంది…అయితే, బ్యాంకులు నిర్ణయించుకుని కూడా దాదాపు 50 వేల రూపాయల వరకూ రుణాల విడుదల నిలుపుదల చేయడం వల్ల ఎక్కువగా నష్టపోయిందీ, నష్టపోతున్నదీ రైతులే!