పేదలకు దక్కాల్సిన రేషన్ సరుకులు పక్కదారి పట్టాయా…? సీనియర్ ఎమ్మెల్యేలు, గత ప్రభుత్వంలో కీలక వ్యక్తులకు దగ్గర ఉన్న నేతలే ఇందులో ఉన్నారా…? పక్కదారి పట్టిన వేల కోట్ల రేషన్ సరుకు పోర్టు ద్వారా విదేశాలకు వెళ్లిందా…?
ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తున్నాయి. ఏపీలో రేషన్ షాపుల నుండి లబ్ధిదారులకు, పేదలకు అందాల్సిన సరుకులు పక్కదారి పట్టాయని, ఇంటికే రేషన్ సరుకులు ఇస్తున్నామన్న పేరుతో… ప్రభుత్వం నుండి అందాల్సిన మొత్తం పేదలకు అందలేదని కూటమి సర్కారు అనుమానిస్తోంది.
ఇప్పటికే ఈ ఇష్యూపై సీరియస్ గా ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్… దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించేందుకు రెడీ అని ప్రకటించారు. కాకినాడ పోర్టు ద్వారా పేదలకు అందాల్సిన రేషన్ పెద్ద ఎత్తున పక్కదారి పట్టిందని, కోట్లాది రూపాయల స్కాం అని మండిపడ్డారు.
కాకినాడ పోర్టు నుండి విదేశాలకు సరుకులు ఎవరి సహయంతో వెళ్లాయి, రేషన్ మాఫియాలో ఎవరెవరు ఉన్నారు, అక్రమ బియ్యం దందాలో ఉన్న గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఎవరో మొత్తం తేలుస్తామని ప్రకటించారు.
ఇక నుండి రేషన్ షాపుల్లో పట్టిక ఉంటుందని… ఏయే రకాల సరుకులు ప్రభుత్వం అందిస్తుంది, ఒక కుటుంబానికి ఎంత మొత్తం ఇస్తుంది, ఎంత ధరకు ఇస్తుందో పారదర్శకంగా ప్రతి రేషన్ దుకాణంలో బోర్డు పెట్టిస్తామని ప్రకటించారు.