జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు సూపర్ హిట్టయ్యాయి. ఓట్ల వర్షం కురిపించింది. అందుకే జగన్.. తనకు ఓట్లేసిన జనానికి చెప్పిన రత్నాలన్నీ ఇవ్వాలని ఆరాటపడుతున్నారు. మేనిఫెస్టోను తన జేబులోనే కాదు.. అధికారుల జేబుల్లోనూ ఉంచుకోవాలని ఆదేశించారు. అంత వరకూ బాగానే ఉన్నా.. అమలుకు వచ్చే సరికి.. ఒక్కో రత్నం రాయిగా మారిపోతోంది. రైతు భరోసా పథకంలో ఒకే సారి రూ. 12500 ఇస్తానని.. కేంద్రం కిసాన్ సమ్మాన్ పథకం పెట్టక ముందే చెప్పిన జగన్.. తీరా అధికారంలోకి వచ్చాక ఆ మొత్తాన్ని రూ. 7,500కి పరిమితం చేశారు. కేంద్రం ఇచ్చే రూ. ఆరు వేలు కూడా.. తన పధకం ఖాతాలో వేసుకున్నారు. మూడు విడతలు చేయడంతో రైతులు ఉసూరుమన్నారు. పైగా .. సగం మంది రైతుల్ని అనర్హులుగా ప్రకటించినట్లుగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు.. అమ్మఒడి పథకం కూడా అదే పరిస్థితి. మొదటగా 70 లక్షల మంది తల్లులకు సాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వివిధ కారణాలు చెప్పి.. సగం మందిని ఎలిమినేట్ చేసేసింది. లబ్దిదారుల సంఖ్యను రోజుకు రోజుకు కుదిస్తూ పోతోంది. దాంతో.. అసలైన లబ్దిదారుల సంఖ్య 40 లక్షలు దిగువకు వచ్చింది. ఇప్పుడు వారికి కూడా.. మొత్తం ఒకే సారి ఇస్తారా అంటే.. ప్రభుత్వ వర్గాలు కూడా.. చెప్పలేకపోతున్నాయి. ఎందుకంటే. ఇప్పటికీ ఖజానా ఖాళీగా ఉంది. వివిధ శాఖల వద్ద ఉన్న నిధులన్నింటినీ అమ్మఒడికి మళ్లించారు.
ఈ రత్నాల అమలులో మరో మోసపూరిత కోణం ఏమింటే.. సామాజికవర్గాల వారీగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు.. అమ్మఒడి నిధులు మళ్లించి.. వాటినే.. పంపిణీ చేస్తున్నారు. అంటే పథకం అమ్మఒడి..కానీ ఇచ్చేది మాత్రం.. ఆయా కార్పొరేషన్ల కింద… ఆయా వర్గాలకు చేయాల్సిన సాయం సొమ్ములు. బీసీలకు ఉపాధి నిమిత్తం రుణాలుగా ఇవ్వాల్సిన రూ. 3వేల 432 కోట్ల రూపాయలు, కాపు కార్పొరేషన్ కింద కాపులకు పంపిణీ చేయాల్సిన రూ. 568 కోట్ల 54 లక్షలు.. సహా క్రిస్టియన్ ఆర్థిక సహకార సంస్థ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ . ఎస్టీ, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ల నుంచి వేల కోట్లు తీసుకున్నారు. ఇది తీవ్ర వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వం తమను మోసం చేస్తోందన్న అభిప్రాయానికి ఆయా వర్గాలు వస్తున్నాయి.
ప్రభుత్వం నవరత్నాల అమలులో… ప్రజలలను దారుణంగా మోసం చేస్తోందన్న అభిప్రాయం… అంతకంతకూ బలపడుతోంది. నవరత్నాల పేరుతో తమను వంచించారనే భావన ఏర్పడుతోంది. టీడీపీ హయంలో ఉన్న సంక్షేమ పథకాలన్నింటికీ కోత విధించినా.. ఈ పరిస్థితి రావడం.. ప్రజలకు మింగుడుపడటం లేదు.