నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు.. అన్నట్లుగా మారిపోతోంది.. ఏపీ ప్రభుత్వ పని తీరు. వ్యక్తిగత ఇళ్లకు.. సమాధులకు కోట్లకు కోట్లు ప్రజాధనాన్ని కేటాయించుకుంటూనే… మరో వైపు.. చర్చిలకు కూడా భూరి విరాళాలను ప్రజాధనాన్ని వెచ్చించేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చర్చిలను కట్టుకోవడానికి మైనారిటీ సంక్షేమ శాఖ నిధులను విడుదల చేస్తూ.. నేరుగా జీవోనే విడుదల చేశారు. ఇప్పుడీ వ్యవహారం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా నిజాంపట్నంలోని హరిజనవాడలో మూడు చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం రూ. పదిహేను లక్షలు విడుదల చేసింది. ఏపీ స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరే్షన్ నుంచి ఈ నిధులు కేటాయించారు.
నిజానికి ఏ కార్పొరేషన్ అయినప్పటికీ.. చర్చిలు కట్టుకోవడానికి నిధులు మంజూరు చేయరు. ఆయా వర్గాల ప్రజల అవసరాలు.. సంక్షేమం చూడటానికి మాత్రమే నిధులు మంజూరు చేయాలి. కానీ.. అధికారులు రాజుని మించిన రాజభక్తిని చూపించడంలో రాటుదేలిపోయారు. నేరుగా.. చర్చిలకే నిధుల విడుదల చేసేశారు. ప్రజలు పన్నుల రూపంలో కట్టే సొమ్మును ఇలా.. చర్చిల నిర్మాణాలకు ఉపయోగించడం చట్ట విరుద్ధం. మత మార్పిళ్ల విషయంలో.. ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతున్న సమయంలో ఇలా నేరుగా చర్చిల నిర్మాణానికే నిధులు మంజూరు చేయడం.. కలకలం రేపుతోంది.
పాస్టర్లకు నెలవారీ జీతం ఇవ్వాలనుకున్న ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. వాలంటీర్లతో మొదటగా.. చర్చి ఫాదర్ల సర్వేనే జరిపించారు. అవన్నీ మత మార్పిళ్ల కోసం ప్రయత్నాలన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు నేరుగా చర్చిలకు నిధులు మంజూరు చేయడం ప్రారంభించారు. ఒక్క సారి ఇలా విడుదల చేయడం ప్రారంభిస్తే.. ప్రజల సంక్షేమానికి కేటాయించాల్సిన నిధులు..మొత్తం.. ఇలా మతమార్పిళ్ల ఉద్యమానికి పోయే అవకాశం ఉందన్న విమర్శలు రావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది.