పోలవరం ప్రాజెక్ట్ విషయంలో.. రివర్స్ టెండరింగ్ కు వెళ్లే విషయంలో.. అనేక ప్రతిబంధకాలను పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ పదే పదే లేఖల రూపంలో వ్యక్తం చేస్తున్నా… ఏపీ సర్కార్ మాత్రం.. బిందాస్ అంటోంది. ఈ రోజు రివర్స్ టెండర్లు పిలుస్తారని చెప్పి.. రాత్రికి రాత్రే పీపీఏ.. ఓ సుదీర్ఘమైన లేఖను పంపింది. దాన్ని చెత్తబుట్టలో వేసేసిన ఏపీ సర్కార్.. రివర్స్ టెండర్లకు ఆహ్వానం పలికింది. పోలవరం హెడ్ వర్క్స్ లో మిగిలిపోయిన పనులు, హైడల్ ప్రాజెక్ట్ కు కలిపి ఒకే టెండర్ కు శాఖాధికారులు టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని అమెరికా వెళ్లకముందు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దాని ప్రకారమే… అధికారులు తమ బాధ్యత నిర్వర్తించారు.
పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ పై ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసి వీటిపై క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే ఒక నిర్ణయానికి రావాలని సూచించింది. పోలవరం ప్రాజెక్ట్ కు రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం పెరగటమే కాకుండా జాప్యం కూడా జరుగుతుందని పీపీఏ అభిప్రాయపడింది. పీపీఏ సమావేశం తర్వాత అదే మాటలు చెప్పారు. రాత్రి రాసిన లేఖలోనూ అదే చెప్పారు. అయితే పీపీఏ అధ్యయనం చేయాలని కోరిందేగానీ టెండర్లు పిలవొద్దని చెప్పలేదని ప్రభుత్వం వాదిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మౌఖికంగా అనుమతి తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం పోలవరం హెడ్ వర్క్స్ లో మిగిలిపోయిన పనులు రూ. 1850 కోట్ల రూపాయలు, జల విద్యుత్ కేంద్రానికి 3 వేల 220 కోట్ల రూపాయలకు రివర్స్ టెండరింగ్ నోటిపికేషన్ జారీ చేశారు. ఈ రెండూ కలిపి రూ. 5 వేల 070 కోట్లు. వీటితోపాటు పోలవరం గేట్లను బేకం సంస్థ తయారు చేస్తోంది. గేట్లను తయారు చేసేందుకు 387.56 కోట్ల రూపాయలతో టెండర్ ను దక్కించుకుంది. అయితే ఈ పని నుంచి వైదొలగాలని ఇప్పటికే బేకం సంస్థకు పోలవరం ఎస్ఈ నోటీస్ లు జారీ చేశారు. వీటికి కూడా రివర్స్ టెండర్లను పిలువనున్నారు. రివర్స్ టెండరింగ్ డాక్యుమెంట్లను కేపీఎంజీ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా ప్రభుత్వం తయారు చేయించింది.