ఆంధ్రప్రదేశ్లోని రోడ్ల దుస్థితిని ప్రజల ముందు ఉంచేందుకు … వారి కోసం శ్రమదానం చేసేందుకు పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. గాంధీ జయంతి రోజున ఉదయం రాజమండ్రి ధవళేశ్వరం వంతెన మీద.. సాయంత్రం అనంతపురం జిల్లా కొత్త చెరువులో రోడ్లను శ్రమదానంతో బాగు చేయాలని నిర్ణయించారు. రెండు చోట్ల రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. పాలకులు పట్టించుకోలేదు. అధికారులు వినిపించుకోలేదు. జనసేన నేతలు డిజిటల్ ఉద్యమంలో భాగంగా వాటినీ కవర్ చేశారు. అయితే ఆ రెండు రోడ్లను ప్రభుత్వం హుటాహుటిన బాగు చేస్తోంది.
అనంతపురం జిల్లా కొత్త చెరువులో పవన్ శ్రమదానం చేయాలనున్న రోడ్డులో తారు పనులను ప్రారంభించారు. ఈ రోజుతో అక్కడ పనులు పూర్తవుతాయి. ధవళేశ్వరం వంతెనపైనారాత్రికి రాత్రి పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. మామూలుగా అయితే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయి. ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకుండా చివరి క్షణంలోనే శ్రమదానం స్థలాన్ని ప్రకటిస్తాయి. కానీ జనసేన నేతలు ఐదు రోజులు ముందుగానే ప్రకటించడం వల్ల ప్రభుత్వం ఆయా రోడ్లను బాగు చేయడానికి అవకాశం లభించింది.
అయితే ప్రభుత్వం తాము శ్రమదానం చేయాలనుకున్న రోడ్లను బాగు చేసిందని జనసేన ఉద్యమాన్ని ఆపే అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో పాడైపోని రోడ్డంటూ లేదు. ఈ కారణంగా పవన్ కల్యాణ్ మరో చోట ఎక్కడైనా శ్రమదానం చేసే అవకాశం ఉంది. అయితే ఆయనను రోడ్ల మీదకు అనుమతిస్తారా అనే డౌట్ ఇప్పటికే ఉంది. ప్రస్తుతం వైసీపీ, జనసేన మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. సినీ పరిశ్రమ సమస్యల విషయంలో పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం .. వాటిపై వైసీపీ నేతలు బూతులు లంకించుకోవడంతో సమస్య తీవ్ర రూపం దాల్చింది.