వరద బాధితుల నష్టాన్ని వీలైనంత వరకూ భర్తీ చేయాడనికి చంద్రాబాబు వీలైనంత లోతుగా ఆలోచిస్తున్నారు. సాధారణంగా మధ్యతరగతి ప్రజల ఆలోచనలు, కష్టాలు ఎలా ఉంటాయో.. వాటికి తగ్గట్లుగా అర్థం చేసుకుని నష్టం భర్తీ చేసే ఆలోచన చేస్తున్నారు. నీళ్లలో తడిచిపోయిన వాహనాలు, వాషింగ్ మెషిన్లు వంటి వాటి విషయంలో చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఇన్సూరెన్స్ కంపెనీలన్నింటిన ఒకే వేదికపైకి తీసుకు వచ్చి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయించారు. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్లంతా క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇన్సూరెన్స్ లేని వాళ్ల కోసం.. ప్రత్యేకంగా రిపేర్ సెంటర్లతో మాట్లాడి పనులు చేయిస్తున్నారు. కొంత మందిని ఇళ్ల వద్దకూ పంపి రిపేర్లు చేయిస్తున్నారు. ఇక ఎలక్ట్రానిక్ కంపెనీలతోనూ చంద్రబాబు మాట్లాడారు. ఎల్జీ కంపెనీ వరదల్లో పాడైన తమ ఎలక్ట్రానిక్ పరికరాలకు ఉచిత సర్వీస్ చేస్తామని ప్రకటించింది. విడిభాగాల విషయంలనూ యాభై శాతం డిస్కౌంట్ ప్రకటించిది.
ఇప్పటికే ఇంటింటికి నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. త్వరలో అందరికీ జత బట్టలు పంపిణీ చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. అందరికీ కాకపోయినా.. ఇంట్లో బట్టలు కూడా కొట్టుకుపోయిన వారికి పంపిణీ చేయాలనుకుంటున్నారు. ఆప్కో ద్వారా ఈ వస్త్రాలను పంపిణీ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే అగ్నిమాపక శాఖ ద్వారా ఇళ్లను శుభ్రం చేయించే ప్రయత్నం చేస్తున్నారు.
విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో కొన్ని వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. సాధారణ స్థితికి తీసుకురావడంతో పాటు.. వరద వల్ల తాము చాలా నష్టపోయామన్న భావన వారికి రాకుండా.. వీలైనంత వరకూ మధ్యతరగతి ప్రజల ఆలోచనకు తగ్గట్లుగా సాయం చేసేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అందర్నీ సంతృప్తి పరుస్తున్నాయి.