ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. కరోనా విజృంభిస్తున్న మొదటి రోజుల్లో.. దేశం మొత్తం లాక్ డౌన్ విధించేసినా స్థానిక ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని పట్టుబట్టి.. ఎస్ఈసీని కూడా తొలగించి రచ్చ రచ్చ చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం.. కరోనా కాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ఈ స్పందన.. రాజకీయ, న్యాయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ.. తాండవ యోగేష్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమని ఏపీ ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది.
ప్రస్తుతం దేశం కరోనా భయం నుంచి బయటపడుతోంది. ఏపీలో కూడా లాక్ డౌన్ ఎత్తేశారు. బీహార్ సహా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ అంశాలను పిటిషనర్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నికలు ఇప్పుడు సాధ్యం కాదని తెలిపింది. ీదంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయం తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఎస్ఈసీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను నవంబరు 2కి వాయిదా వేసింది.
స్థానిక సంస్థల ఎన్నికలను.. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత కాలం నిర్వహించకూడదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే మార్చి వరకూ.. ఎస్ఈసీ పదవీ కాలం ఉంది. అందుకే ఇప్పుడు సాధ్యం కాదని హైకోర్టుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయమే ఫైనల్. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో.. అన్నదానిపైనే… స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉండే అవకాశం ఉంది. ఆయన ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనా .. ప్రభుత్వ యంత్రాంగం సహకరించకపోతే ఏం చేయలేరు. ప్రస్తుతం యంత్రాగం.. పని తీరు ఎలా ఉందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.