విభజన చట్టంలో సెక్షన్ 108 కింద రాష్ట్రపతికి ఏవో ప్రత్యేకాధికారాలు వున్నాయని అవి 2017 జూన్2తో ముగిసిపోతాయని చెప్పడం వాస్తవ విరుద్ధమని ఎపి ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. ఏ చట్టంలోనైనా సాంకేతిక పొరబాట్లుల, అనుకోకుండా దొర్లే తప్పిదాలు సరిదిద్దడానికి నిర్దిష్ట కాలపరిమితితో ఇలాటి అధికారాలఱు రాష్ట్రపతికి కల్పించడం సర్వసాధారణం. మండలాల విలీనం, శాసనమండలి స్థానాల సంఖ్యలో అచ్చుతప్పులు, అటూ ఇటూ పడటం వంటివి సరిచేయడానికి ఇప్పటికే ఆ అధికారాలు వినియోగించారు. అయితే అదంతా అప్పటికే అంగీకారం కుదిరిన సాంకేతిక వ్యవహారం మాత్రమే. అంతేగాని ఇద్దరి మధ్య ఏవైనా సమస్యలు వస్తే జోక్యం చేసుకోవచ్చన్న వివరణ సరికాదని వారు చెబుతున్నారు. అలా చూస్తే ఈ మూడేళ్లలో ఎప్పుడూ ఎందుకు దాన్ని వినియోగించలేదని ప్రశ్నిస్తున్నారు. పైగా ఇప్పటి వరకూ చర్చలోకి వచ్చి పరిష్కారం కాకుండా మిగిలివున్న అంశాలన్నిటికీ పాత నిబందనలే వర్తిస్తాయి తప్ప అవి అర్థంతరంగా ఆగిపోవని కూడా ప్రభుత్వం చెబుతున్నది. ఈ విషయమై సుప్రీం కోర్టులో కేసు వేసే ఆలోచన కూడా లేదని, కొన్ని ఇతర అంశాలపై తర్వాత కోర్టుకు వెళ్లవచ్చని కూడా చెబుతున్నారు.