ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటే అంతే. ఎవరైనా నిర్ణయించినంత ఫీజు ఇచ్చేయాల్సిందే. లేకపోతే కేసులవుతాయా..? అరెస్టులయ్యాకా కేసులు పెడతారా..? ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటారా..? వ్యాపారాల్ని ాపేస్తారా..? అన్నది సిట్యూటేషన్ డిమాండ్‌ని బట్టి నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో బార్ల యజమానుల పరిస్థితి ఇదే. కోవిడ్ కారణంగా బార్లను తెరుచుకునేందుకు ఇప్పటి వరకూ ఇవ్వని పర్మిషన్ను ప్రభుత్వం హఠాత్తుగా ఇచ్చింది. అయితే.. ఉత్తినే కాదు.. భారీ మొత్తంలో ఫీజు కట్టాలి. లైసెన్స్ ఫీజును పెంచడమే కాదు.. ఇరవై శాతం అదనంగా కోవిడ్ ఫీజుగా నిర్ధారించారు. ఇలా మొత్తం బార్ల మీద నుంచి రూ. 180 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బార్లు 840. ఇవి ఆరు నెలలుగా మూతపడి ఉన్నాయి. అందులో ఉన్న మద్యం ఎక్స్పైరీ డేట్ అయిపోతుందని… కనీసం ఉన్న స్టాక్‌ను అమ్ముకోవాలని గతంలో మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చినప్పుడు బార్ల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ కొన్న ధరకే మద్యం షాపులకు అమ్ముకోవచ్చి ప్రభుత్వం సలహా ఇచ్చింది. అంతే కాదు.. లాక్ డౌన్ సమయంలో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్ముకున్నారా.. బార్లన్నింటిలో తనిఖీలు కూడా చేసింది. కొంత మందిపై కేసులు కూడా పెట్టింది. అలాంటిది ఇప్పుడు.. ఫీజుల బాదుడు కోసం.. బార్లను తెరుచుకోవడానికి చాన్సిచ్చేసిది.
ఇప్పుడు బార్ తెరవాలంటే.. ఒక్కో బార్ యజమానికి పెరిగిన లైసెన్స్ ఫీజుతో పాటు ఇరవై శాతం కోవిడ్ రుసుం కలిపి రూ. 22 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నెలల నుంచి దుకాణాలు మూసేసుకున్న బార్ల యజమానులు ప్రభుత్వ ఉత్తర్వులతో షాక్‌కు గురయ్యారు. ప్రభుత్వం వారికి ఆ ఉత్తర్వులు ఇచ్చి వదిలి పెట్టలేదు. డెడ్ లైన్ పెట్టింది. 30 రోజుల్లో ఆ మొత్తం కట్టకపోతే చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశించింది. అంటే బార్ల యజమానులు.. తప్పనిసరిగా కట్టాలన్నట్లుగా ఆ ఆదేశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నంత మాత్రాన.. ఇలా మద్యం … బార్లపై దారుణంగా ఫీజులు.. కోవిడ్ పన్నుల వసూలు చేయడం ఏమిటన్న ఆవేదన అందరిలోనూ కనిపిస్తోంది.