తెలుగు చిత్రసీమ ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డుల్ని గత 5 యేళ్లుగా ప్రకటించడం లేదు. రాష్ట్రం విడిపోయిన తరవాత నంది ప్రస్తావనే తీసుకురాలేదు. చిత్రసీమ నుంచి ప్రతినిధుల బృందం వెళ్లి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రినీ, సినిమాటోగ్రఫీ శాఖామంత్రినీ కలిసినా.. ప్రయోజనం లేకపోయింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం నంది స్థానంలో సింహా అవార్డుల్ని అందించడానికి అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా కళ్లు తెరిచింది. నంది అవార్డుల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 2012 నంది అవార్డుల కమిటీకి సీనియర్ నటి జయసుధని అధ్యక్షురాలిగా నియమించింది. 2013 నంది అవార్డుల కమిటీకి సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ ఆధ్వర్యం వహిస్తారు. వీళ్ల కమిటీ అతి త్వరలోనేనంది అవార్డుల కోసం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. రెండు సంవత్సరాల అవార్డుల్నీ ఒకేసారి ప్రదానం చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఉగాది రోజున నంది అవార్డుల ప్రదానం ఉండొచ్చన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. 2014, 15, 16 సంవత్సరాలకు గానూ అవార్డు కమిటీ నియమించడానికీ, అవార్డుల్ని అందివ్వడానికీ ఇంకా ఎంత కాలం పడుతుందో..?? మరోవైపు ఎన్టీఆర్ జాతీయ అవార్డుల విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ అవార్డుని ఈసారైనా పునరుద్ధరిస్తారేమో చూడాలి.