వచ్చే విద్యా సంవత్సరం మంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంగ్లీష్ మీడియం ఒక్కటే ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని శపథం చేసిన ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయినా విద్యా హక్కు చట్టం ప్రకారం దేశంలో ఏ మీడియంలో అయినా చదువుకునే స్వేచ్ఛ , వెసలుబాటు విద్యార్థుల కు ఉంది. తమ పిల్లలు ఏ మీడియంలో చదవాలి అనేది తల్లిదండ్రులు నిర్ణయించుకోవచ్చు. అయితే దీనికి భిన్నంగా ఏపీ సర్కార్ ఆంధ్రాలో ఉండే వాళ్లంతా ఇంగ్లీష్ మీడియం చదవాల్సిందే అంటూ జీవో తీసుకొచ్చారు. దీనిపై హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. విచారణలో ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా జీవోలు తెచ్చిందని హైకోర్టు నిర్ధారించి వాటిని కొట్టివేసింది.
అయితే జగన్ మాటంటే మాటే నని ఎవరు అడ్డు వచ్చినా … ఇంగ్లీష్ మీడియం అమలు చేసి తీరుతామని హైకోర్టు తీర్పు వచ్చిన రోజున మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు అయినా వెళతామని స్పష్టం చేశారు. అయితే ఈ అంశంపై న్యాయ నిపుణులు ఇంకా ముందుకు వెళ్లడం మంచిది కాదని ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 50కి పైగా అంశాల్లో కోర్టులు ఏపీ ప్రభుత్వాన్ని తప్పు పట్టాయి. నిర్బంధ ఇంగ్లీష్ మీడియం జీవో కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్ధించే అవకాశాలు లేవని నిపుణులు, సలహాదారులు ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలుస్తుంది. దీంతో జగన్మోహన్ రెడ్డి అయిష్టంగానే మీడియం ఎంపిక అవకాశాన్ని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తుంది.
మంగళవారం అర్ధరాత్రి విద్యాశాఖ నుంచి ఒక జీవో విడుదలైంది. ఈ జీవో ప్రకారం ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ఏ మీడియంలో చదువుకోవాలనేది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఇష్టమని జీవో లో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఇక్కడ కూడా తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి . ఎందుకంటే జీవో లో వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ మీడియంలో చదువుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన దరఖాస్తులను గ్రామ సచివాలయ ఇవ్వాలి. అలా వచ్చిన దరఖాస్తుల ను బట్టి మీడియం ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఇప్పటికే విద్యా కమిటీల పేరుతో అందరి వద్దా ఇంగ్లీష్ మీడియం కోసం ప్రభుత్వం అంగీకార పత్రాలు తీసుకుంది. వీటిని చూపించి అందరూ ఇంగ్లీష్ మీడియం కోరుతున్నారని ప్రభుత్వం చూపించే అవకాశం ఈ జీవో ద్వారా వచ్చిందని అంటున్నారు.