కృష్ణా జిల్లాలో బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనలో ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేస్తూ.. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే విజయవాడ, మచిలీపట్నం కమిషనర్లకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ చర్యలు తీసుకునే ముందు ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ ప్రకాశరావుతో క్షమాపణలు చెప్పిస్తూ.. బ్యాంకర్లను వేడుకుంటూ ఓ వివరణ ఇప్పించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా.. బ్యాంకర్లను బతిమాలుతున్నట్లుగా.. ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామన్నట్లుగా లేఖ రాశారు. కేంద్రం ఈ వ్యవహారంపై సీరియస్ అవడంతో తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం.. క్షమాపణలు చెప్పడం వంటివి జరుగుతున్నాయి.
కానీ ఈ మొత్తం ఘటనకు అసలు సూత్రధారులెవరనేదానిపై మాత్రం.. లోతుగా వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధపడటం లేదు. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే ఓ సలహాదారు.. ఆయనకు తోడు మరో ఉన్నతాధికారి కలిసి బ్యాంకులను ఎలా “మేనేజ్” చేయాలో ప్లాన్ చేసి మరీ.. జిల్లాల వారీగా ఓ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ముందుగా.. కృష్ణా జిల్లా బ్యాంకులపై ఆ ప్రయోగం చేశారని అధికార వర్గాల్లో చాలా ఉధృతంగా ప్రచారం జరుగుతోంది. తీరా బయటపడేసరికి.. వారి ఆదేశాలను పాటించిన వారిని బలి పశువుల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన వివాదాస్పదం అయిన తర్వాత ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ ప్రకాశరావు మీడియాతో మాట్లాడినప్పుడు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అలా చేశామని ప్రకటించారు. తీరా పూర్తి వివాదం అయ్యాక… ఉన్నతాధికారులకు.. ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇలా వివరణ ఇచ్చిన కాసేపటికే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
ఓ సలహాదారు… మరో మున్సిపల్ ఉన్నతాధికారి.. ఉద్యోగులతో నీతిమాలిన పనులు చేయించి… ఏదో గొప్పగా బ్యాంకర్లను భయపెట్టామని అనుకున్నారు. అయితే ఇలాంటి పనులకు నేరుగా ఆదేశాలివ్వలేరు కాబట్టి.. మౌఖికంగానే చెబుతూంటారు. అందుకే.. ఇప్పుడు.. అమలు చేసిన మున్సిపల్ కమిషనర్లు ఇరుక్కుపోయారు. ఈ వ్యవహారం వారి కెరీర్లో మచ్చగా ఉండటమే కాదు.. భవిష్యత్‌లో కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. తాము చెప్పిన పని చేసి సస్పెన్షన్‌కు గురయినందున.. కొద్ది రోజుల్లో ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్‌కు ప్రభుత్వ పెద్దలు మంచి పోస్టింగ్ ఇవ్వొచ్చు కానీ.. ఆయన ట్రాక్ రికార్డులో అదో మైనస్‌గా ఉండిపోతుంది. ప్రభుత్వం మారిన తర్వాత క్రమశిక్షణాచర్యలూ తీసుకునే ప్రమాదం ఉంది.
మొదట.. చెత్త వేసింది.. కార్మికులేనని వారిపై నెట్టేయాలని ప్రయత్నించారు. కానీ.. కృష్ణా జిల్లా మొత్తం ఒకే సారి జరగడంతోనే… కార్మికులు కాదని స్పష్టమయింది. కార్మికులు అలా చెత్త వేసే అవకాశమే లేదు. ఆ తర్వాత కిందిస్థాయి… చెత్త కాంట్రాక్టర్లను బలి చేసే ప్రయత్నం చేశారు. కానీ..కేంద్రం చాలా సీరియస్‌గా స్పందించడంతో… అధికారుల్ని బలి చేయక తప్పలేదు. కానీ..ఈ చెత్త ఆలోచన చేసిన.. సలహా ఇచ్చిన వారు మాత్రం సేఫ్‌గానే ఉండనున్నారు. కింది స్థాయి పనోళ్లు మాత్రం బలపోయారు.