అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి సహజంగానే షాక్ ఇచ్చింది. ఎంతగా ప్రయత్నిస్తున్నా.. అనుకూల తీర్పులు రాకపోతూండటంతో పై స్థాయిలో తేల్చుకోవాలని నిర్ణయిస్తున్నారు. తాజాగా ఈ తీర్పుపైనా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే.. హైకోర్టులోనే డివిజన్ బెంచ్‌కు వెళ్దామా.. లేక సుప్రీంకు వెళ్దామా అన్న ఆలోచన చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే సీబీఐ విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. కానీ సీబీఐ ఇంత వరకూ పరిశీలించలేదు. జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా దాని గురించి ప్రస్తావిస్తూ ఉంటారని చెబుతారు. అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది స్టాక్‌మార్కెట్‌కు సంబంధించిన అంశమని.. అసలు ఆ పదమే భారత శిక్షా స్పృతిలో లేదని హైకోర్టు తేల్చేయడంతో ఇప్పుడు సీబీఐ కూడా ముందడుగు వేయలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
అందుకే తీర్పు విషయంలో సుప్రీంకోర్ట్ లో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే హైకోర్టు తీర్పును.. ఓ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో క్షుణ్ణంగా పరిశీలింప చేస్తున్నారు. ప్రభుత్వానికి అనధికారిక న్యాయసలహాదారుగా ఆయన వ్యవహారిస్తున్నారు. మొత్తంగా కీలకమైన వ్యవహారాలు అన్నీ ఆయన చేతుల మీదుగానే నడుపుతున్నారు. ఇప్పుడు ఆయన ఏ ఏ పాయింట్లను లీడ్‌గా తీసుకుని సుప్రీంకోర్టుకు వెళ్లాలో గైడ్ చేయబోతున్నారు. ఆయన ఇచ్చే పాయింట్లను ఆధారంగా చేసుకుని సాంకేతిక అంశాల ఆధారంగా అయినా… హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై స్టే తీసుకు రావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.
ఏ క్షణమైనా సుప్రీంకోర్టులో ఈ మేరకు పిటిషన్ వేస్తారని చెబుతున్నారు. అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే కేసులే లేకపోతే… అమరావతిలో అవినీతి అనేదే ఉండదు. ఇప్పుడు అలాంటికేసులు పెట్టడానికి కూడా చాన్స్ ఉండదు. దీంతో వైసీపీ సర్కార్… అవినీతి ఆరోపణలు చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. అందుకే తీర్పుపై స్టే కోసం… అటు హైకోర్టు డివిజన్ బెంచ్ అయినా.. ఇటు.. సుప్రీంకోర్టు అయినా సరే… తీవ్రంగా ప్రయత్నించాలని నిర్ణయించారు.