నవ్యాంధ్ర నగర రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలు కోవడం లేదు. ఎన్నికల సమయానికి అమరావతి పాలనా నగరానికి ఓ రూపు తీసుకు రావాలని.. చంద్రబాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి నిధుల సమస్య ప్రధాన అడ్డంకిగా ఉంది. అటు కేంద్రమే కాదు.. ఇటు ప్రపంచబ్యాంక్ లాంటి సంస్థల నుంచి నిధులు తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యేకంగా టాస్క్ పెట్టుకుని మరీ ప్రపంచ బ్యాంక్ కు ఏపీ నుంచి ఫిర్యాదులు వెళ్తున్నారు. ఫిర్యాదులపై విచారణకు ప్రపంచబ్యాంక్ బృందాలు వెళ్తున్నాయి.. వస్తున్నాయి. కానీ లోన్ విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
కేంద్రం ఏ మాత్రం కనికరం చూపే అవకాశం లేకపోవడంతో చంద్రబాబు బాండ్ల బాట ఎంచుకున్నారు. మార్కెట్లో ఇతర నగరాలు ప్రకటించనంత భారీ వడ్డీ ఆఫర్ చేసి.. బాంబే స్టాక్ ఎక్సేంజ్ లో అమ్మకానికి పెట్టారు. తొలి విడతగా అనూహ్యమైన స్పందన వచ్చింది. రూ. 1300 కోట్ల సమీకరణ కోసం ప్రయత్నిస్తే.. ఏకంగా రూ. 2000కోట్లకు గంటలలోనే ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది. దాంతో అమరావతిపై, తనపై ఇన్వెస్టర్లకు నమ్మకం ఉందని… అంచనా వేసుకున్న చంద్రబాబు.. రెండో విడత బాండ్ల జారీకి సిద్ధమయ్యారు. 27వ తేదీన బీఎస్ఈలో మరోసారి బాండ్లను అమ్మకానికి పెడుతున్నారు.
అయితే ఈ బాండ్ల అమ్మకంపై…. విపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రుణం తీసుకునే అవకాశం ఎక్కడా దొరకనందునే… చంద్రబాబు బాండ్లు అమ్ముతున్నారని… అధిక వడ్డీలు ఆఫర్ చేస్తూ.. ప్రజలపై భారం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి బాండ్లు నష్టదాయకమైనవని చెబుతూ… విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం.. ఈ విమర్శలు ఏ పని చేసినా చేస్తూనే ఉంటారని… తన పని తాను చేసుకుపోవాలని నిర్ణయించుకుంది.