వెనుబడిన కుటుంబాలకు చేయూత ఇవ్వడం, వారిని అన్ని విధాలుగా ఆదుకోవడం అనేది ప్రభుత్వం బాధ్యతల్లో కీలకమైంది. దీని కోసమే కదా సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారు. పేదలకు సాయం చేయడమే ఈ పథకాల ముఖ్యోద్దేశం. వారి జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఉండాలి. కానీ, ఇప్పుడు సంక్షేమ పథకాల ప్రయోజనమే నెమ్మదిగా మారిపోతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. కేవలం కులాల ప్రాతిపదికనే కొత్త పథకాలను అమలు చేయాలని చంద్రబాబు సర్కారు ఆలోచిస్తోంది! తక్కువ ఖర్చుతో ఎక్కువ సంతృప్తి సాధించాలనే లెక్కేస్తోంది. ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకునే సంక్షేమానికి పెద్ద పీట వేయాలని ఆలోచిస్తూ ఉండటం గమనార్హం.
తక్కువ నిధులతో ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చే విధంగా సంక్షేమ పథకాలు ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశంగా ఓ కథనం మీడియాలో వచ్చింది. వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చడంపై ప్రధానంగా దృష్టి సారించాలనీ, ముందుగా ప్రజలకు తక్షణ సాయం అందేలా ప్రభుత్వ పథకాల రూపకల్పన ఉండాలనీ, ఆ తరువాత దీర్ఘకాలిక ప్రయోజనాలపై కూడా దృష్టి పెట్టాలని చంద్రబాబు చెబుతున్నారట! ముందుగా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా పెంచాలనీ, తద్వారా వారిలో అభివృద్ధి మొదలౌతుందని వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం సందర్భంగా చంద్రబాబు చెప్పినట్టు కథనం. ఉదాహరణకు మూడు లక్షలు పెట్టి ఒకరికి ట్రాక్టర్ ఇచ్చే బదులు, అదే సొమ్ముతో 30 మందికి ప్రయోజనం కలిగేలా చూడాలని సూచించారు.
చంద్రబాబు చేస్తున్న సూచన వినడానికి బాగానే ఉంది. కానీ, అంతర్లీనంగా ప్రభుత్వం ఆశిస్తున్నది ఏంటో అనేది కూడా ఇక్కడే అర్థమౌతోంది. ప్రజలకు వ్యక్తిగత ప్రయోజనాలను పెంచడంపై దృష్టి సారించాలంటున్నారు. అంటే, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కదా ఇలా చెబుతున్నది! సంక్షేమ పథకాలు ఏవైనాసరే, పేదలను దృష్టిలో పెట్టుకోవాలి. వారిని ఒక సమూహంగా చూస్తూ ప్రయోజనం కలిగేలా చేయాలి. అంతేగానీ, ముందుగా వ్యక్తిగత ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని లెక్కడం సరికాదేమో అనేది విశ్లేషకుల మాట. అంతేకాదు, తక్కువ ఖర్చుతో ఎక్కువ సంతృప్తి సాధించడం అనేట్టుగా సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆలోచించడం కూడా సరైన పద్ధతి కాదనే చెప్పాలి. సంక్షేమ పథకాలకు ఖర్చు చేసే నిధుల విషయంలో పెట్టుబడి, లాభాలు అనే లెక్కలు ఎలా చూస్తారు..? ఇంకోటీ.. పేదరికాన్ని ఆదాయ ప్రాతిపదికగా చూడాలిగానీ, ఫలానా కులంలో ఇంతమంది పేదలున్నారు, ముందుగా వారికి ప్రయోజనం చేకూర్చాలి అనేట్టుగా విడదీయకూడదు! ఇలా కులాలవారీగా ప్రయోజనాలను కల్పించాలనే ఆలోచన ఉందంటే… దాని వెనక ఓటు బ్యాంకు రాజకీయాలే కనిపిస్తాయి. అందుకే, సంక్షేమ పథకాల ప్రయోజనాలు మారుతున్నట్టుగా ఉందని చెప్పడం! అధికార పార్టీకి భవిష్యత్తులో ప్రయోజనం చేకూరాలన్న లక్ష్యమే సంక్షేమ పథకాల అమలుకు ప్రేరణగా మారడం సరైంది కాదనేదే విశ్లేషకుల వాదన.