ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్దమవుతోంది. ఆరోగ్య, ఆత్యవసరానికి సంబంధించిన ప్రభుత్వ ప్రైవేటు సర్వీసులన్నింటినీ ఎస్మా పరిధిలోకి తెస్తూ ఆదేశాలు జారీ చేసింది. 6 నెలల పాటు ఎస్మా చట్టం అమలులో ఉంటుంది. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని.. శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందని జీవోలో హెచ్చరించారు. ఎస్మా పరిధిలోకి వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బంది కూడా వస్తారు. అలాగే.. వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణాను కూడా.. ఎస్మా పరిధిలోకి చేర్చారు.
మందుల కొనుగోలు, రవాణా, తయారీ, అంబులెన్స్ సర్వీసులు.. మంచినీరు, విద్యుత్ సరఫరా, భద్రతా సంస్థలు, ఆహార సరఫరా… బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ కూడా..ఎస్మా పరిధిలోకి వచ్చింది. పెద్ద ఎత్తున కేసులు బయటపడుతున్న సమయంలో ఎవరూ విధులకు.. డుమ్మా కొట్టకుండా ఈ జీవోను జారీ చేసినట్లుగా చెబుతున్నారు. వైద్య, ఆరోగ్యసిబ్బందికి కూడా ప్రభుత్వం సగం చొప్పునే చెల్లిస్తోంది. అదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రులు కరోనా చికిత్సకు సహకరించవనే అభిప్రాయం వినిపిస్తోంది.అందుకే ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిచిందన్న భావన వ్యక్తమవుతోంది.
ఇప్పటికే..అన్ని జిల్లాల్లోని 50… అంతకన్నా ఎక్కువ పడకల సామర్థ్యం కలిగిన ప్రైవేటు ఆసుపత్రులన్నింటినీ జాతీయ విపత్తుల చట్టం కింద స్వాధీనం చేసుకుంటున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. వాటన్నింటినీ కరోనా చికిత్సకోసమే ఉపయోగించాలని నిర్ణయించారు. ఇప్పుడు సిబ్బందిపై ఎస్మా ప్రయోగించారు.