కర్నూలుకు హైకోర్టు తరలింపుపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్రం స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం రాతపూర్వకంగా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ హైకోర్టు ధర్మాసనం ఓ అంగీకారానికి వచ్చిన తర్వాతే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని, ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని కేంద్రం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన ధర్మాసనం విభజన చట్టం ప్రకారం అమరావతిలో ఏర్పాటైందని, 2019 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో పనిచేస్తోందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలు నగరానికి తరలించడానికి ఏపీ ముఖ్యమంత్రి 2020 ఫిబ్రవరిలో ప్రతిపాదించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని అందులో భాగంగా కర్నూాలును న్యాయరాజధానిగా ప్రకటించారు. అక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. అయితే అందు కోసం చేసిన ప్రయత్నాలు న్యాయస్థానాల్లో నిలువలేదు. దీంతో హైకోర్టు తరలింపు కోసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయలేకపోయారు.
నిజానికి హైకోర్టు తరలించాలటే చట్టం అవసరం లేదు కేంద్రం చెప్పిన దాని ప్రకారం.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి .. ఏపీ ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్లవచ్చు. కానీ మూడు రాజధానుల పే్రుతో రాజకీయం చేస్తూ విషయాన్ని వైసీపీ నేతలు సంక్లిష్టం చేశారు. రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారు కానీ .. సీరియస్గా ఎలాంటి ప్రతిపాదనలూ ముందుకు తీసుకెళ్లలేకపోయారు.