అమరావతిలో గత ప్రభుత్వం పెట్టిన రూ. వేల కోట్ల ప్రజాధనం వృధా పోతుందన్న పిటిషన్పై హైకోర్టు విచారమలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమరావతిలో రూ. 52 వేల కోట్ల రూపాయల నిధుల వ్యయం జరిగిందని ఇప్పుడు రాజధానిని తరలిస్తే ఆ మేరకు ప్రజాధనం వృధా అవుతుందని హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. రూ. 52 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచారని..అనేక పనులు పూర్తయ్యాయని..కొన్ని మధ్యలో ఉన్నాయని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి సీఆర్డీఏ డాక్యుమెంట్లను హైకోర్టుకు పిటిషనర్ సమర్పించారు.
ఇప్పటివరకు అమరావతికి ఎంత నిధులు ఖర్చు చేశారు..? నిర్మాణాలు ఎక్కడ ఆగాయనే వివరాలు తమకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇదంతా ప్రజల సొమ్ము అని, దీని వలన ప్రభుత్వ ఖజానాకు నష్టం కాదా అని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. పూర్తయిన భవనాలను సంవత్సరంన్నర నుంచి వినియోగించుకుండా వదిలేస్తే పాడవుతాయి కదా అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. వాటికి వెచ్చించిన నిధులు ప్రజలేవనని..అంటే ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లేనని హై కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించారు.
అమరావతి నిధులు ఎక్కడ సమీకరించారు..? పనులు ఎందుకు ఆపాల్సి వచ్చింది..? దీనికి ఎవరు భాధ్యులు..? కాంట్రాక్టర్ లకు చెల్లించాల్సిన బిల్లులు ఇంకా ఎంత ఉన్నాయి…? ఏ నిర్మాణం ఎక్కడ ఆగిపోయిందో.. పూర్తి వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ ను పార్టీగా చేసి నోటీసులు జారీ చేసింది. అమరావతిలో ఏం జరగలేదని.. గ్రాఫిక్స్ మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఇప్పుడు.. హైకోర్టుకు… ప్రభుత్వం పెట్టిన ఖర్చు మొత్తం వివరాలు సమర్పించాల్సి ఉంది.