ఎస్ఈసీగా రమేష్ కుమార్ తొలగింపుపై కౌంటర్ దాఖలు చేయడానికి ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది.. ఏకంగా నెల రోజులు కావాలని హైకోర్టును కోరారు. అయితే.. హైకోర్టు మూడు రోజులు మాత్రమే సమయం ఇచ్చింది. మూడు రోజుల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం..తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. గత వారం.. అత్యంత సీక్రెట్‌గా జరిపేసిన వ్యవహారాలతో.. ఎస్ఈసీగా ఉన్న రమేష్ కుమార్ ను తొలగించి.. తమిళనాడుకు చెందిన రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ను నియమించారు. ఆయన బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ క్రమంలో.. రమేష్ కుమార్‌తో పాటు.. మొత్తం ఆరు పిటిషన్లు ఆ నియామకం రాజ్యాంగ విరుద్ధమని చెప్పి హైకోర్టులో పిటిషన్లు వేశారు.
తనను అక్రమంగా తొలగించారంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ వేయగా.. టీడీపీ తరపున వర్ల రామయ్య, బీజేపీ తరపున మాజీమంత్రి కామినేని శ్రీనివాస్, మరో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, యోగేష్ అనే వ్యక్తి కూడా పిటిషన్లు వేశారు. ఇవి విచారణకు వచ్చిన సమయంలో.. కౌంటర్ దాఖలుకు నెల రోజుల గడువు కోరిన ప్రభుత్వ న్యాయవాది కోరారు. దానికి తమకు పిటిషన్లు కూడా అందలేదన్న కారణాలను చెప్పారు. రమేష్ కుమార్ పిటిషన్ మాత్రమే అనుమతించాలని వాదించారు. బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ తరపున వాదనలు వినిపించిన జంధ్యాల రవిశంకర్ .. ఎన్నికలు వాయిదా వేయాలని కోరినవారిలో .. తమ పిటిషన్‌దారుడు కామినేని ఒకరని.. తను మాజీ మంత్రి అని గుర్తు చేశారు. బీజేపీ తరపున కూడా.. పిటిషన్ దాఖలు కావడం.. రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. కేంద్రం ఆశీస్సులతోనే.. గవర్నర్.. రమేష్ కుమార్ మార్పును.. అరగంటలోనే ఆమోదించారని.. అనుకుంటున్న సమయంలో.. తాను హైకమాండ్ ఆదేశాల మేరకే పిటిషన్ వేశానని కామినేని శ్రీనివాస్ ప్రకటించడేమ దీనికి కారణం.
అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని హైకోర్టు తెలిపింది. సాయంత్రంలోగా పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాదికి అందించాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయడానికి నెల రోజుల సమయం ఇవ్వడం కుదరదని మూడు రోజుల్లో కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఆర్డినెన్స్ తీసుకు రావడానికి..కొత్త ఎస్ఈసీ నియమించడానికి ఒక్కటంటే.. ఒక్క రోజు కూడా సమయం తీసుకోని ఏపీ సర్కార్.. కోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి మాత్రం నెల రోజులు కోరడం.. అందర్నీ ఆశ్చర్య పరిచింది.