ఆంధ్రప్రదేశ్‌లో అవాంఛనీయమైన పరిణామాలు రోజు రోజుకు వెలుగు చూస్తున్నాయి. అక్కడ న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై దెబ్బ కొట్టేందుకు భారీ కుట్రలు జరుగుతున్నాయని మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య ఫోన్ సంభాషణతో వెల్లడయింది. తాజాగా ఇప్పుడు.. న్యాయమూర్తుల ఫోన్ల ట్యాప్ అయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐదుగురు న్యాయమూర్తులు తమ ఫోన్లలో సాంకేతిక సమస్యలు వచ్చినట్లుగా అనుమానించి… పరిశీలన చేయించడంతో ఈ విషయం బయటపడిందని.. తెలుగు ప్రముఖ దినపత్రిక ప్రకటించింది. న్యాయమూర్తుల పేర్లు చెప్పకపోయినా… విశ్వసనీయమైన సమాచారం లేకపోతే.. ఇలా రాసే అవకాశం లేదు.
ఏపీలో న్యాయమూర్తులపై అధికార పార్టీ కొంత కాలంగా ఎదురు దాడి చేస్తోంది. మొదట అధికార పార్టీ నేతలు.. తర్వాత సోషల్ మీడియా ద్వారా.. ఆ తర్వాత రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న వారి ద్వారా.. ఈ దాడి జరుగుతోంది. గతంలో… ఓ అంశంలో వ్యతిరేక తీర్పు వచ్చినప్పుడు.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్.. హైకోర్టు న్యాయమూర్తుల కాల్ డేటా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అలా ఎందుకుకు అన్నారో కానీ.. ఇప్పుడు సంచలనాత్మకంగా.. వారి ఫోన్లు ట్యాప్ అయినట్లుగా సాంకేతిక విభాగం నిర్ధారించడం.. కలకలం రేపుతోంది. దినపత్రిక ఈ విషయాన్ని బయట పెట్టడానికి ముందే తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అనుమించిన ఆ న్యాయమూర్తులు… అన్ని రకాల సాంకేతిక పరీక్షలు చేయించారు. తమ ఫోన్లు వేరేవారి నియంత్రణలోకి వెళ్లినట్లుగా ఆధారాలు కూడా సేకరించారు.
ఇప్పటికే ఈశ్వరయ్య ఆడియో టేపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రవీంద్రన్ నేతృత్వంలో విచారణకు హైకోర్టు ఆదేశించింది. సీబీఐ, విజిలెన్స్ రవీంద్రన్‌కు సహకరించాలని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో రవీంద్రన్ నివేదిక సమర్పించనున్నారు. ఈ లోపే… ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఇది ఇంకా సీరియస్ నేరం. హైకోర్టు న్యాయమూర్తులు ముందుగానే సాంకేతిక ఆధారాలను సిద్ధం చేసుకున్నందున… విచారణకు ఆదేశిస్తే మాత్రం.. ఎవరు ఫోన్ ట్యాప్ చేశారో పసిగట్టడం చాలా సులువు. న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ చేసే అవసరం.. అంత సాంకేతికత ఎవరికి ఉంటుంది..?