పధ్నాలుగో తేదీన తమ ఎదుట హాజరు కావాలని.. ఆంధ్రప్రదేశ్ డీజీపీని హైకోర్టు ఆదేశించడం సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఎవరిని పడితే వారిని అదుపులోకి తీసుకుని అరెస్టులు చూపించకుండా చిత్ర హింసలు పెడుతున్నారని.. ఇతర పార్టీల నేతలు ఆరోపిస్తున్న సమయంలో.. అచ్చంగా అదే తరహాలో అక్రమ అరెస్ట్ వ్యవహారంలో.. హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం… కలకలం రేపుతోంది. విశాఖపట్నానికి చెందిన మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనవడు రెడ్డి గౌతమ్, ఆయన భార్య లోచనిని పోలీసులు కొన్నాళ్ల కిందట అరెస్ట్ చేశారు. కానీ అధికారికంగా చాలా రోజుల పాటు అరెస్ట్ చూపించలేదు. దీంతో కుటుంబసభ్యులు .. హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చూపించారు. వారు ఓ మ్యాన్ పవర్ కంపెనీని నిర్వహిస్తున్నారని… ఉద్యోగాలిస్తామని నిరుద్యోగుల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారన్న ఫిర్యాదులు వచ్చాయని అందుకే అరెస్ట్ చేశామని కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారం మొత్తం అనుమానాస్పదంగా ఉండటంతో.. హైకోర్టు జుడీషియల్ విచారణకు ఆదేశించింది. విచారణ చేసిన విశాఖ సీనియర్ సివిల్ హైకోర్టుకు నివేదిక అందచేశారు. నివేదిక ఆధారంగా హైకోర్టుకు హాజరుకావాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్లో పోలీసు తీరు ఇటీవలి కాలంలో తీవ్ర వివాదాస్పదమవుతోంది. సోషల్ మీడియా పోస్టుల గురించి.. ఇతర అంశాలపై టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తల్ని కూడా అనేక మందిని అదుపులోకి తీసుకుంటున్నారు కానీ… అరెస్ట్ చూపించడం లేదు. పెద్ద వివాదం అయితే… కేసు పెడుతున్నారు. లేకపోతే.. హింసిస్తున్నారని.. ప్రతిపక్ష పార్టీల నేతలు చెబుతున్నారు. అదే తరహాలో ఇప్పుడు ఉన్న రెడ్డిగౌతమ్ కేసులో… హైకోర్టు… డీజీపీని హైకోర్టుకు పిలిపించింది. విచారణంలో ఏం చెబుతుందోనన్న ఆసక్తి… పోలీసుల బాధితుల్లో వ్యక్తమవుతోంది.