సంగం డెయిరీని ఎలాగైనా ప్రభుత్వ పరం చేసుకోవాలనుకున్న ఏపీ ప్రభుత్వ పెద్దల ప్రయత్నాలు న్యాయస్థానాల్లో తేలిపోయాయి. గతంలోనే సింగిల్ బెంచ్ న్యాయస్థానం సంగం డెయిరీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమని తీర్పు చెప్పింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు గత మే పదిహేడో తేదీన కొట్టి వేసింది. ఆ జీవో చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. డెయిరీ కార్యకలాపాలను డెయిరీ డైరక్టర్లే నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఆ తీర్పుపైన ఏపీ ప్రభుత్వం డివిజనల్ బెంచ్‌కు వెళ్లింది. డివిజనల్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది. సంగం డెయిరీ స్వాధీనం చేసుకోవడానికి కుదరదని స్పష్టం చేసింది.
ఏప్రిల్ 23న సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ధూళిపాళ్లను తెల్లవారుజామునే అరెస్ట్ చేశారు. నోటీసుల్లాంటి ప్రక్రియ ఏమీ చేపట్టలేదు. ఆ తర్వాత రెండు రోజులకే… సంగం డెయిరీకి ఉన్న మిల్క్ ప్రొడ్యూసర్స్ అనుమతిని రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. సంగం డెయిరీ యాజమాన్య హక్కులను మార్చేసింది. సంగం డెయిరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేసినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. సంగం డెయిరీ కంపెనీల చట్టం పరిధిలో ఉంది. అయితే ఆ చట్టంలోకి అక్రమంగా మార్చారని .. సంతకాలు ఫోర్జరీ చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. గతంలో ఈ అంశంపై నోటీసులు జారీ చేసింది. అయితే సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకు వచ్చుకున్నారు. అక్రమాలు జరిగాయో లేదో నిర్ధారణ కాకుండానే… సంగం డెయిరీని స్వాధీనం చేసుంది. రోజువారీ వ్యవహారాలను చూసే బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ కు ఇప్పగించింది.
ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమని డైరక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జీవో చెల్లదని హైకోర్టు స్పష్టంచేయడంతో మళ్లీ కార్యకలాపాలు ఇప్పటిలాగే డైరక్టర్ల చేతుల మీదుగానే నడుస్తాయి. సంగం డెయిరీ, ధూళిపాళ్ల నరేంద్ర విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మొదటి నుంచి వివాదాస్పదమవుతోంది. తాజాగా సంగం డెయిరీ విషయంలోనూ చివరికి ఏదో చేయాలనుకుని చేతులు కాల్చుకున్నట్లయింది.