న్యాయవ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాజకీయ నేతలు.. వారిపై ఫిర్యాదులు చేసినా కేసులు పెట్టని ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయని స్పీకర్ తమ్మినేని సీతారం, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీలు నందిగం, విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. రాజ్యంగబద్ధమైన… ప్రజాస్వామ్య పదవుల్లో ఉన్న వారు.. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా న్యాయవ్యవస్థపై దాడికి పాల్పడినట్లుగా తాము పరిగణిస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారిపై శరవేగంగా కేసులు పెడుతున్న పోలీసులు.. న్యాయవ్యవస్థపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన వారి విషయంలో ఫిర్యాదు చేసినా ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించింది. హైకోర్టు రిజిస్ట్రార్ కేసు దాఖలు చేసినా పదవిలో ఉన్నవాళ్లపై ఎందుకు కేసులు పెట్టలేదని ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయవ్యవస్థపై దాడి చేసిన నేతలను రక్షించేందుకే కేసు నమోదు చేయలేదని భావించాల్సి ఉంటుందని.. సీఐడీ ఈ విషయంలో విఫళమైతే.. సీబీఐ విచారణకు ఆదేశించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. స్పీకర్ సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. తిరుపతి కొండపై చేశారని.. అంతా చూస్తూంటే..ఓ ప్రణాళిక ప్రకారం న్యాయవ్యవస్థపై దాడిగా భావించాల్సి వస్తుందన్నారు. ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యల నేపధ్యంలో.. సీబీఐ విచారణ చేయిస్తే అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
హైకోర్టు తీర్పులపై ఏమైనా అభ్యంతరాలుంటే.. సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవాలి కానీ.., బహిరంగంగా దూషించడం ఏమిటని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఏపీలో లాంటి పరిస్థితులు దేశంలో ఎక్కడా లేవని ధర్మాసనం మండిపడింది. చట్ట విరుద్ధంగా.. రాజ్యాంగ విరుద్ధంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను హైకోర్టులు తప్పు పట్టాయి. సుప్రీంకోర్టులోనూ అదే పరిస్థితి. అయినప్పటికీ.. వైసీపీ నేతలు.. చట్టాలు, రాజ్యాంగాలకు వ్యతిరేకంగా అయినా సరే.. తీర్పులు తమకే అనుకూలంగా రాకపోతే… న్యాయమూర్తులపై బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారు. ఈ వ్యవహారంపై రిజిస్ట్రార్ ఫిర్యాదు చేసినా సీఐడీ కేసులు పెట్టలేదు.