స్టేట్ ఎన్నికల కమిషనర్ నిర్ణయాలపై స్టే విధించాలంటూ.. హైకోర్టుకు వెళ్లిన ఏపీ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల ప్రక్రియను ప్రస్తుత పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ రమేష్ కుమార్ ప్రభుత్వానికి తెలిపారు. ఏర్పాట్లు చేయాలని.. సహకరించాలని కోరుతున్నారు. అయితే.. కరోనా కారణంగా ఇప్పుడల్లా ఎన్నికలు నిర్వహించలేమంటున్న ప్రభుత్వం… ఎస్ఈసీకి సహకరించడం లేదు. సమీక్షలు కూడా చేయనివ్వడం లేదు. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న విమర్శలు రావడంతో… హైకోర్టు ద్వారానే ఆపించాలన్న ప్రయత్నం చేసింది. ఈ మేరకు ఏపీలోని కరోనా పరిస్థితుల్ని వివరిస్తూ.. పిటిషన్లు దాఖలు చేశారు.
ఎన్నికలు నిర్వహణ కోసం ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలన్నారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. స్టే ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేసింది. అయితే.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎన్నికల కమిషనర్‌ను ఆదేసించింది. తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా వేసింది. ప్రభుత్వం సహకరించడం లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేయనున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ప్రభుత్వం కూడా.. ఎన్నికలు నిర్వహించకుండా ఉండేందుకు నేరుగా అసెంబ్లీలోనే తీర్మానం చేశారు. దాని ఆధారంగా ఆర్డినెన్స్ జారీ చేసే యోచనలో ఉన్నారు.
ఇలా చేయడమూ… ఎస్ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడమేనన్న అభిప్రాయాల ఉండటంతో ప్రభుత్వం తదుపరి ఏం చేస్తుందన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఎస్ఈసీ మాత్రం… ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి తీరుతామంటున్నారు. ప్రభుత్ం మాత్రం సహకరించడానికి సిద్ధం లేదు. ఈ క్రమంలో రాను రాను ఏపీలో స్థానిక ఎన్నికల విషయంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.