కర్నూలులో హైకోర్టు బెంచ్ కు ప్రతిపాదనలు పంపాలని చంద్రబాబు నిర్ణయించారు. గత ప్రభుత్వం కర్నూలులో న్యాయరాజధాని పేరుతో ప్రజల్ని వంచించింది. అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జగన్నాథ గట్టుపైనే హైకోర్టుకట్టబోతున్నామని ప్రకటించి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టులో అలాంటి ఆలోచన లేదని చెప్పారు. న్యాయరాజధాని అనే ప్రకటన చేసిన తరవాత .. హైకోర్టును తరలించేందుకు ఒక్క చిన్న అడుగు కూడా వేయలేదు వైసీపీ ప్రభుత్వం.
కానీ టీడీపీ ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతామని హామీ ఇచ్చింది. ఆ మేరకు కేంద్రానికి సిఫారసు చేయాలని నిర్ణయించుకుంది. హైకోర్టుకు సంంబధించిన నిర్ణయాల ప్రాసెస్ చాలా సమయం తీసుకుంటుంది. అయితే ఇప్పుడు కేంద్రంలో .. చంద్రబాబుది కీలక పాత్ర. హైకోర్టుకు కర్నూలు బెంచ్ ఉండాలని గట్టిగా పట్టుబడితే … వీలైనంత త్వరగా ప్రాసెస్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. బీజేపీ కూడా ఈ హామీ ఇచ్చింది. జనసేన కూడా అనుకూలమే. ఇప్పటికే తమిళనాడుకు మధురై బెంచ్ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో పలుసార్లు హైకోర్టు బెంచ్ కోసం.. గుంటూరు.. కర్నూలు.. వంటి చోట్ల ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో వైసీపీ రాజకీయ చిచ్చు కారణంగా.. కర్నూలులోనూ జరిగాయి.
ఇప్పుడు చంద్రబాబు కర్నూలు న్యాయవాదుల కోరికను తీర్చాలని డిసైడయ్యారు. ప్రభుత్వం నుంచి కేంద్రానికి అధికారిక తీర్మానం వెళ్లిన తర్వాత రెండేళ్లలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. జగన్నాథ గట్టుపైనే .. హైకోర్టు బెంచ్ కోసం భవనం నిర్మించే అవకాశం ఉంది.