ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తమ ఎదుట హాజరు కావాలని హైకోర్టు ధర్మాసనం మరోసారి ఆదేశించింది. వివిధ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీసులు తమకు అప్పగించడం లేదని పలువురు వాహన దారులు పెద్ద ఎత్తున హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇటీవలి కాలంలో అక్రమ మద్యం తరలింపు పేరుతో.. వేల సంఖ్యలో వాహనాలను సీజ్ చేశారు. ఏపీ ఎక్సైజ్ 34(ఏ) సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్న వాహనాలను మేజిస్ట్రేట్ లేదా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ముందు హాజరు పరచాల్సి ఉంటుంది. అయితే పోలీసులు ఈ నిబంధనలు పాటించకుండా…పోలీస్ స్టేషన్లలోనే ఉంచేస్తున్నారు. దీంతో అవి ఎండకు ఎండి.. వానకు తడిచి పాడైపోతున్నారు. వాహనాలను చట్టబద్ధంగా విడిపించుకునే ప్రయత్నం చేసినా పోలీసులు అంగీకరించడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
తాము నిబంధనల మేరకు మూడు లేదా అంతకంటే తక్కువ మద్యం బాటిళ్లను తీసుకెళ్తున్నప్పటికీ పోలీసులు తమ వాహనాలను స్వాధీనం చేసుకున్నారని పిటిషనర్లు పలువురు వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఎక్సైజ్ యాక్ట్‌లోని సెక్షన్ 46, సీఆర్పీసీ సెక్షన్ 102 నిబంధనలు పాటించని అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సోమవారం జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. డీజీపీ నుంచి వివరాలు సేకరించి చెప్పాలని మంగళవారానికివాయిదా వేసింది. ఈ రోజు విచారణలో ప్రభుత్వ న్యాయవాది ఆ వివరాలు చెప్పలేదు. హైకోర్టు ధర్మానసం ఆగ్రహం వ్యక్తంచేసిం నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని డీజీపీకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
బుధవారమే డీజీపీ హైకోర్టు ఎదుట హాజరు కావాల్సిఉంది. ఇప్పటికి గౌతం సవాంగ్ హైకోర్టు ఎదుట హాజరు కావాల్సి రావడం మూడో సారి. గతంలో ఓ సారి అక్రమ నిర్బంధం కేసులో..మరోసారి చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా జరిగిన ఘటనల విషయంలోనూ హైకోర్టు అలాగే పిలిపించింది. ఇప్పుడు మూడో సారి… హైకోర్టు ఎదుట హాజరు కావాల్సిన పరిస్థితి.