విజయనగర రాజుల కుటుంబం చేతుల్లో ఉన్న మాన్సాస్ ట్రస్ట్‌ను రాత్రికి రాత్రి సంచయిత అనే మహిళ చేతికి అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నింటినీ హైకోర్టు కొట్టి వేసింది. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా.. సంచయిత నియామక జీవోను పూర్తి స్థాయిలో హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. పాత జీవోల ప్రకారం మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజును పునర్నియామకం చేయాల్సిందిగా ఆదేశించింది. గత ఏడాది మార్చి ఏడో తేదీన రాత్రికి రాత్రి సంచయితను మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు నాలుగు రోజుల అనంతరం ఈ ట్రస్ట్ కు కొత్తపాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొత్త పాలక మండలితో ప్రమాణస్వీకారం చేయించే వరకూ రహస్యంగా ఉంచారు. ఆ తర్వాత రెండు రోజుకు బహిరంగపరిచారు.
ప్రభుత్వం రహస్యంగా ఉంచి.. సంచయిత ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత రిలీజ్ చేసిన జీవోలో.. మాన్సాస్ ట్రస్ట్ కు చైర్మన్ గా ఉన్న విజయనగరం మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజు స్థానంలో ఆయన సోదరుడు ఆనంద్ గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తున్నట్లుగా ప్రభుత్వం జీవోలో పేర్కొంది. రోటేషన్ పద్ధతిలో ట్రస్ట్ వ్యవహారాలను సంచయిత పర్యవేక్షిస్తారని జీవోలో పేర్కొన్నారు. ట్రస్ట్ బోర్డ్ ను కూడా నియమించారు. పూసపాటి గజపతులు లక్షల కోట్లు విలువ చేసే తమ విలువైన ఆస్తులు చదువుల గుడిగా పేరు సంపాదించిన మాన్సాస్ అనే ట్రస్టుకి దారాదత్తం చేశారు. వంశపారంపర్యంగా ఆ ట్రస్టుకి ఛైర్మెన్ గా కొనసాగిన పూసపాటి ఆనందగజపతిరాజు మరణంతో… ఆ స్థానాన్ని సోదరుడైన పూసపాటి అశోక్ గజపతిరాజు పొందారు. ట్రస్ట్ నిబంధనల్లో పురుషుడు మాత్రమే.. చైర్మన్‌గా ఉండాలని ఉంది. ప్రభు్తవం వీటిని పట్టించుకోలేదు.
అశోక్ గజపతిరాజు వైద్య పరీక్షల కోసం ఢిల్లీలో ఉన్న సమయంలో ఈ వ్యవహారం అంతా సాగడంతో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన అశోక్‌గజపతిరాజు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అశోక్ గజపతి రాజు పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు చివరికి సంచయిత నియామకం చెల్లదని తీర్పు చెప్పారు. ఈ మధ్య కాలంలో సంచయిత ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. అశోక్ గజపతిరాజును అనేక రకాలుగా ప్రభుత్వం వేధించింది. సంచయిత అసభ్యపరమైన వ్యాఖ్యలతో అశోక్ గజపతిరాజును విమర్శించారు. మహరాజా కాలేజీను ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు కూడా చేశారు. మాన్సాస్ ఉద్యోగులకు జీతాలు అందడం కూడా కష్టమైపోయింది. చివరికి.. హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచినట్లయింది.
హైకోర్టు తీర్పు పట్ల అశోక్ గజపతి రాజు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా.. చట్టం.. రాజ్యాంగం ప్రకారం పాలన చేయాలని హితవు పలికారు. అయితే మంత్రి వెల్లంపల్లి తీర్పును సమీక్షించి.. అప్పీలుకు వెళ్తామని ప్రకటించారు.