మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజే కొనసాగుతారని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం గతంలో అశోక్ గజపతిరాను తొలగించి సంచయిత చైర్మన్‌గా నియమించడాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టి వేసింది. అశోక్ గజపతిరాజు చైర్మన్‌గా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్‌లో ప్రభుత్వంతో పాటు సంచయిత కూడా సవాల్ చేశారు. కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ ఆ పిటిషన్లను కొట్టివేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. తదుపరి విచారణను డిసెంబర్‌కు వాయిదా వేసింది. రెండు రోజుల కిందట ఊర్మిలా గజపతిరాజు కూడా అశోక్ ను తొలగించి తనకు చాన్సివ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.
దానికి ఆమె చెప్పిన కారణం… ప్రభుత్వం తనను కూడా వారసురాలిగా గుర్తించిందని చెప్పడం. అయితే కొట్టి వేసిన జీవోను చూపించి ఆమె హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఆమె పిటిషన్ విచారణలో నిలవదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అశోక్ గజపతిరాజే చైర్మన్‌గా కొనసాగుతారని హైకోర్టు స్పష్టం చేయడంతో ఆమె పిటిషన్ కు కూడా ఈ తీర్పు వర్తిస్తుందని అంచనా వేస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై గతంలో ఎలాంటి వివాదాలు ఉండేవి కావు. కానీ ఏపీ ప్రభుత్వం హఠాత్తుగా ఆనందగజపతిరాజు మొదటి భార్య కుమార్తెను … అర్థరాత్రి జీవోల ద్వారా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌ను చేయడంతో ఒక్క సారిగా వివాదం ప్రారంభమయింది. ఆయన ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపోరాటం చేసి విజయం సాధించారు.
ఆ తర్వాత ప్రభుత్వం వైపు నుంచి అనేక రకాల ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. విచారణ పేరుతో మాన్సాస్ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదు. అయితే ఆయన ఆ అంశంపైనా పిటిషన్ వేసి.. హైకోర్టు నుంచి అనుకూల ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కారణం ఏమిటో కానీ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు ఉండకూడదని వైసీపీ నేతలు పట్టుదలగా ఉన్నారు. అయితే ఆ ట్రస్ట్ కోసం అశోక్ గజపతిరాజు పూర్వికులు ఇచ్చిన లక్షల కోట్ల విలువైన భూములపై వైసీపీ నేతల కన్ను పడిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.