పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై స్టేటస్ కో వచ్చే నెల 21వ తేదీ వరకూ కొనసాగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ లోపు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. వచ్చే నెల ఇరవై ఒకటి నుంచి రాజధాని పిటిషన్లను ప్రాధాన్యతాంశంగా తీసుకుని రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. అది కూడా వర్చువల్ పద్దతిలో కాకుండా.. నేరుగా విచారించనుంది. స్టేటస్ కో కొనసాగించడం వల్ల మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయాలను అమలు చేయడం సాధ్యం కాదు.
రైతులు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు మొత్తం 70 పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం ఒకే సారి విచారిస్తుంది. రైతుల తరపున వాదించిన లాయర్… స్టేట్ గెస్ట్ హౌస్ పేరుతో రాజధాని తరలింపున కోసం.. శంకుస్థాపన చేశారని… కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా వేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలింపులో అదీ కూడా ఓ భాగమేనని వాదించారు. ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సెప్టెంబరు 10వ తేదీ లోపు కౌంటరు దాఖలు చేయాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది.
గవర్నర్ సంతకం తర్వాత గెజిట్ ప్రకటించిన ప్రభుత్వానికి.. రాజధానిని విశాఖకు తరలించడానికి స్టేటస్ కో అడ్డంకిగా మారింది. సుప్రీంకోర్టుకు సైతం.. వెళ్లింది. అయితే.. అక్కడా హైకోర్టులోనే వాదించాలనే సూచన రావడంతో.. ప్రభుత్వం మళ్లీ హైకోర్టులోనే వాదన వినిపించడానికి సిద్ధమయింది. విచారణ పూర్తయ్యే వరకూ… స్టేటస్ కో ఉంటుందని న్యాయనిపుణులు చెబుతూ వస్తున్నారు. హైకోర్టుకూడా అలాంటి నిర్ణయమే ప్రకటించింది.