సీబీఐ ఏఎస్పీ రాంసింగ్‌పై కడప పోలీసులు పెట్టిన కేసుపై హైకోర్టు స్టే ఇచ్చింది. దర్యాప్తు అధికారిపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడంపై సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారులకు ఓ టెన్షన్ తీరిపోయినట్లయింది. సీబీఐ అధికారి రాంసింగ్ వివేకా హత్య కేసును చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. కీలకమైన విషయాలు వెలుగులోకి తెస్తున్నారు. ఆయన ట్రాక్ రికార్డు గొప్పగా ఉందన్నప్రచారం జరుగుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో రేప్ కేస్లోనూ రాంసింగ్ గట్టిగా నిలబడి ఎవరి ఒత్తిళ్లకూ లొంగలేదని అందుకే అక్కడ బీజేపీ ఎమ్మెల్యే జైల్లోనే మగ్గుతున్నారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు వివేకాహత్య కేసులోనూ ఆయన అంతేగట్టిగా విచారణ జరుపుతున్నారని అంటున్నారు. ఆయనపై వైఎస్ఆర్సీపీ నేతలు… వివేకా కేసులో అనుమానితులు పలు ఆరోపణలు చేస్తున్నారు. తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికి ముగ్గురు ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. సీబీఐ విచారణాధికారిని ఒత్తిడికి గురి చేసి కేసును ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపణలు వస్తున్నప్పటికీ ఎవరూ వెనక్కి తగ్గడంలేదు. ఈ క్రమంలో కేసు నమోదవడం కలకలం రేపింది. అయితే ఈ వివాదాన్ని వీలైనంత తక్కువలో ఉంచేందుకు సీబీఐ వ్యూహాత్మకంగా హైకోర్టును ఆశ్రయించింది. స్టే లభించడంతో సీబీఐ అధికారుల దర్యాప్తును ఏపీ పోలీసులు అడ్డుకునే అవకాశం లేకుండాపోయింది.