రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టినట్లుగా తేలడం..ఆ తర్వాత ఆయనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించే విషయంలో కోర్టు ధిక్కరణకు పాల్పడటమే కాకుండా… ఏకంగా హైకోర్టునే బెదిరించినట్లుగా వాదనలు వినిపించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు … ఎటు తిరిగి ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి ప్రభుత్వ పెద్దల్లో ఏర్పడింది. రఘురామకృష్ణరాజును అనుమతి లేకుడా జైలుకు తరలించడమే కాకుండా.. సీఐడీ కోర్టు… హైకోర్టు ఆదేశించినా… ప్రైవేటు ఆస్పత్రికి తరలించకపోవడంపై హైకోర్టు … కోర్టు ధిక్కరణ కేసులు నమోదు చేసింది. నోటీసులు జారీ అని తీర్పు ప్రకటించినప్పుడు అనుకున్నప్పటికీ.. తుది తీర్పులో ముగ్గురిపై కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించారు. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్తో పాటు సీఐడీ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వోతో పాటు… గుంటూరుప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతిపైనా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని హైకోర్టు తీర్పు స్పష్టంగా చెప్పింది.
అదే సమయంలో కస్టడీలో రఘురామకృష్ణరాజును కొట్టినట్లు ఆర్మీ ఆస్పత్రి నివేదికలో వెల్లడయింది. ఓ వేలుకు ఫ్రాక్చర్ ఉండటం… గాయాలు .. అన్నీ సాంకేతిక ఆధారాలతో సహా ఉన్నాయి. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టులో రఘురామకుమారుడు పిటిషన్ వేశారు. సీబీఐకి ఇవ్వాలని కోరాడు. ఆ పిటిషన్పై మంగళవారం విచారణ జరగనుంది. అంతా కుట్రపూరితం అని .. హత్యకు ప్రయత్నించారన్న తీవ్రమైన అభియోగాలు ఉండటం… కొట్టిన కారణంగా… సుప్రీంకోర్టు సానుకూల నిర్ణయం తీసుకుంటే… అటు కోర్టు ధిక్కరణతో పాటు సీఐడీ ఉన్నతాధికారులు తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చినట్లుగా గట్టిగా ప్రచారం జరుగుతోంది. సీబీఐ విచారణ జరిగితే మొత్తం వ్యవహారం వెలుగులోకి వస్తుంది. అదే జరిగిదే అందరూ ఇరుక్కుపోతారు.
ఇక్కడ అసలు విషయం మరొకటి ఉంది. రఘురామకృష్ణరాజుపై సుమోటోగా కేసు నమోదు చేశామని సీఐడీ పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వానికే సంబంధం లేదని సజ్జల ముందుగానే చెప్పారు. ఇప్పుడు.. తప్పుడు నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఏమిటని విచారణ జరిగితే ప్రభుత్వ వైద్యుల్ని ప్రశ్నించక మానరు. అదే జరిగితే.. అక్కడ్నుంచి మొత్తం తీగ లాగుతారు. చివరికి అది ప్రభుత్వం వద్దకే చేరే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో ఈ కేసు విషయంలో కోర్టునే బెదిరించినట్లుగా ఏఏజీ వ్యవహరించడంతో పరిస్థితి మరింత సీరియస్గా మారింది. న్యాయవ్యవస్థ ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకుంటుందని.. ఎవరూ అనుకోవడం లేదు.