ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మారిన తర్వాత ఏపీ సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయంపై స్టే వచ్చింది. విద్యుత్ సబ్ స్టేషన్లలో షిప్ట్ ఆపరేటర్లు, వాచ్మెన్ పోస్టుల భర్తీపై స్టే విధిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. నిబంధనలు పాటించకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తోందంటూ… కాంట్రాక్ట్ వర్కర్స్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. స్టే విధిస్తూ.. నిర్ణయం తీసుకుంది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇటీవలి కాలంలో.. సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్స్, వాచ్మెన్ ఉద్యోగాల వ్యవహారం.. చర్చనీయాంశమయింది.
అవన్నీ.. కాంట్రాక్ట్ ప్రకారం ఇచ్చే ఉద్యోగాలు కావడంతో ప్రజాప్రతినిధులు డబ్బులు తీసుకుని.. ఉద్యోగుల్ని ఖరారు చేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వచ్చాయి. వాస్తవానికి ఖాళీలు పరిమితంగానే ఉన్నప్పటికీ.. గత ప్రభుత్వంలో నియమితులైన వారిని వేధింపులకు గురి చేసి.. వైదొలిగేలా చేశారన్న వార్తలూ వచ్చాయి. అలా ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉండటంతో.. వాటిని ఎమ్మెల్యేలు.. ఇతర ప్రజాప్రతినిధులు.. అమ్ముకోవడం ప్రారంభించారని అంటున్నారు. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి.
తమ వారిని నియమించడానికి… ఈ నిబంధనలన్నింటినీ… ప్రజాప్రతినిధులు తోసిరాజన్నారు. ఈ కారణంగానే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కోర్టును ఆశ్రయించింది. విచారణలో స్టే వచ్చింది. చీఫ్ జస్టిస్ బదిలీ అయిన తర్వాత ప్రభుత్వ పరమైన నిర్ణయాల్లో మొదటి స్టే వచ్చింది.. ఈ నిర్ణయంపైనే.